దోపిడీ రాజ్యం.. దొరల చిత్తం !!.

Minister Paritala Sunitha Corruption Special Story - Sakshi

మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తోన్న రాప్తాడులో తారస్థాయి అవినీతి

ఒక్క పేరూరు సాగునీటి ప్రాజెక్టు పథకంలోనే రూ.500కోట్లు స్వాహా

భూఆక్రమణలు, ‘గుడ్‌విల్‌’ ద్వారా భారీగా ధనార్జన

మండల స్థాయి కార్యకర్త నుంచి మంత్రి వరకూ ప్రతి ఒక్కరికీ లబ్ధి

మంత్రి సునీత కుటుంబీకుల ఆస్తులు కూడా రూ. వందల కోట్లకు చేరిన వైనం

రాప్తాడు నియోజకవర్గం. ఈ పేరు వింటేనే అధికారుల నుంచి కాంట్రాక్టర్ల వరకూ అందరికీ హడల్‌. ఎందుకంటే అది ఓ ప్రత్యేక సామ్రాజ్యం. ఇప్పటికీ అక్కడ సామంతుల పాలనే నడుస్తోంది. ‘కప్పం’ కట్టే సంస్కృతి ఇంకా కొనసాగుతోంది. అక్కడి పాలకులకు ఎదురు మాట్లాడిన వారిని వేధించే ఘటనలు రోజుకో పల్లెలో రివాజుగా మారింది. ఇవన్నీ తెలిసీ జిల్లా అధికారులు, పోలీసులు ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే అది మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. మంత్రి భర్త పరిటాల రవీంద్ర పేరుతో ఓ భయాన్ని సృష్టించి, దాని ముసుగులో రాజకీయం చేస్తున్నారు. ఈ భయం, దీనికి తోడైన అధికారమే వాళ్లకు కాసుల పంట పండిస్తోంది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండటంతో అధికారంలో ఉండే ఐదేళ్లలో 50 ఏళ్లకు సరిపడా వెనకేసుకోవాలనేది ‘రాప్తాడు’ టీడీపీ శ్రేణుల భావనగా తెలుస్తోంది. సర్పంచ్‌ స్థాయి వ్యక్తి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ ఎవరి పరిధిలో వారు, ప్రభుత్వ ధనాన్ని దోచేశారు. గత నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు రూ.3వేల కోట్ల అవినీతి జరిగిందంటే.. పరిటాల కుటుంబం సాగిస్తున్న దోపిడీ ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇసుక క్వారీల నుంచి చెరువుల్లో మట్టిదాకా.. గుడి భూముల నుంచి గుడిలో లింగం మింగేసే దాకా ప్రతీచోట అవినీతే. ఈక్రమంలో నియోజకవర్గాల్లో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధన ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో అవినీతిపై గ్రౌండ్‌ రిపోర్ట్‌.

సాక్షి ప్రతినిధి, అనంతపురం :ఈ మూడు ఉదాహరణలే కాదు.. రాప్తాడు నియోజకవర్గాన్ని మండలాలు, గ్రామాలుగా విభజించుకుని ప్రతి పనికీ ఓ రేటు కట్టి, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా మంత్రి పరిటాల సునీత కుటుంబీకులు, టీడీపీ నేతలు ఈ నాలుగున్నరేళ్లు దోపిడీ సాగించారు. ఇన్నేళ్లలో ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేసిన అవినీతి కనీసం 3వేల కోట్ల వరకు ఉంటుందని స్పష్టమవుతోంది. 2004 నుంచి 2014 వరకూ పదేళ్లపాటు టీడీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చారు. దీంతో ‘దీపం ఉండగానే ఇల్లు్ల చక్కబెట్టుకోవాలి’ అనే చందంగా అధికారమే అండగా ఈ నియోజకవర్గంలో అడ్డూ అదుపు లేకుండా దోపిడీ కొనసాగింది. పైగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న పరిటాల సునీత మంత్రిగా ఉండడం మరింత కలిసి వచ్చింది. అనంతపురం నగరం చుట్టూ రాప్తాడు నియోజకవర్గం విస్తరించి ఉండడం,  అనంతపురం నియోజకవర్గ ప్రజలకు అవసరమైనా సెంటు స్థలం కూడా ‘అనంత’ పరిధిలో లేకుండా పోయింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేయాలన్నా, పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వాలన్నా రాప్తాడు పరిధిలలోకి అడుగు పెట్టాల్సిందే! దీంతో ఈ ప్రాంతంలో స్థలాల విలువను భారీగా పెంచేశారు. ఖాళీ స్థలం కన్పిస్తే పాగా వేసి ప్రభుత్వ భూములను ఎక్కడికక్కడ కబ్జా చేశారు.

కుటుంబీకులే సామంతులుగా
మంత్రి పరిటాల సునీత మండలాల వారీగా తన కుటుంబీకులకు బాధ్యతలు కట్టబెట్టారు. ఆత్మకూరు, రాప్తాడులను తన సోదరులు బాలాజీ, మురళీకి, చెన్నేకొత్తపల్లిని తన చిన్నాన్న ఎల్‌.నారాయణ చౌదరికి, అనంతపురం రూరల్‌ను మరిది పరిటాల మహేంద్రకు, కనగానపల్లి మండలాన్ని తమ అస్మదీయుడు నెట్టెం వెంకటేశ్‌కు కట్టబెట్టారు. రామగిరి మండలంతో పాటు నియోజకవర్గాన్ని సునీతతో పాటు ఆమె కుమారుడు పరిటాల శ్రీరాం పర్యవేక్షిస్తున్నారు. సామంతుల పాలనను తలపిస్తూ మండలాల వారీగా దోపిడీ పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించారు. మొత్తం నాలుగున్నరేళ్లలో మంత్రి పరిటాల సునీత, మంత్రి కుటుంబీకులు, టీడీపీ నేతలు సాగించిన దోపిడీని లెక్కిస్తే కనీసం రూ.2,500 కోట్ల నుంచి రూ. 3వేల కోట్ల వరకూ ఉంటుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకే ప్రాజెక్ట్‌లోరూ.500 కోట్లకు పైగా దోపిడీ
జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి పేరూరు డ్యాంకు నీళ్లిచ్చేందుకు ఫేజ్‌–1లో రూ.850కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో రూ. 803.96 కోట్లకు పరిపాలన అనుమతులు వచ్చాయి. పేజ్‌–1లో రూ.505కోట్లతో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలెట్టారు. ఈ పనులను ‘మెయిల్‌’ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. నిజానికి పేరూరు డ్యాంకు రూ. 10కోట్లతో ఒక విధానం ద్వారా, రూ.170కోట్లతో మరో విధానం ద్వారా నీళ్లివ్వొచ్చు. కానీ రూ.803కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో ఏజెన్సీ చేస్తున్న పని కూడా రూ.300కోట్ల కంటే ఎక్కువ కాదు. కానీ అంచనాలను భారీగా పెంచి రూ.500కోట్లు దోపిడీకి తెరలేపారు.  

లిఫ్ట్‌ అవసరం లేకుండా..  
హంద్రీ–నీవా ప్యాకేజి కింద మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌లోని 26వ కిలోమీటర్‌ నుంచి (6వ లిఫ్ట్‌ తర్వాత) తురకలాపట్నం చెరువు నింపడం ద్వారా మరువ పారితే వంక ద్వారా ప్రవహించే నీరు పెద్దకోడిపల్లి మీదుగా పావగడ మండలంలోని నాగలమడక చెరువులోకి చేరుకుంటాయి. అక్కడి నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు అందుతాయి. మొత్తం 20 కిలోమీటర్లు మేర నీరు ప్రవహిస్తుంది. ఇందులో 4 కిలోమీటర్లు కర్ణాటకలో, తక్కిన 16 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో ప్రవహిస్తుంది. పైగా ఎక్కడా లిఫ్ట్‌(ఎత్తిపోతలు) అవసరం ఉండదు. గ్రావిటీ ద్వారానే నీళ్లందుతాయి. మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద 650 అడుగుల ఎత్తు ఉంటే, పేరూరు డ్యాం 530 అడుగుల్లో ఉంది. రూ.10కోట్లతో వంకను ఆధునికీకరిస్తే చాలు. ఒకవేళ పైపులైన్‌ వేసినా రూ.30కోట్లు కంటే ఎక్కువ ఖర్చు కాదు. ఇది కాక2008లో అప్పటి సీఎం వైఎస్సార్‌ బోరంపల్లి నుంచి కంబదూరు మీదుగా పేరూరుకు నీళ్లిచ్చేందుకు సర్వే చేయించారు. రూ.85కోట్లతో డీపీఆర్‌ కూడా సిద్ధమైంది. ఈ ప్రకారం నీళ్లిచ్చినా 2008కి ఇప్పటికీ ఏడాదికి 10శాతం అంచనా వ్యయం పెరిగినా వందశాతం రెట్టింపుతో రూ.170కోట్లతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వొచ్చు. ఇవన్నీ కాదని  ఇప్పుడు రూ.803కోట్లు ఖర్చు చేయడం వెనుక మర్మం ఏమిటో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు.  

ప్రభుత్వ భూములూ వదల్లేదు
కనగానపల్లి మండలం కోనాపురం, ముక్తాపురం గ్రామాల్లో సోలార్‌ ప్లాంటు ఏర్పాటవుతోంది. దీంతో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములపై టీడీపీ నేతల కన్ను పడింది. అధికారులూ వత్తాసు పలికారు. దాదాపు 60 ఎకరాల ప్రభుత్వ భూములను మంత్రి సునీత కుటుంబ సభ్యులకు అప్పనంగా అప్పగించారు. వారి పేర్లతో డీ పట్టాలిచ్చేశారు. ఇవే కాక మరో 150 ఎకరాలు ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలకు కట్టబెట్టారు. పట్టాలు చేయించుకున్న ప్రభుత్వ భూములను సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు తిరిగి స్వాధీనం చేయడం ద్వారా ప్రజా ధనాన్ని స్వాహా చేసే కుట్రకు తెరలేపారు. మంత్రి సమీప బంధువులైన పరిటాల రవీంద్ర, పరిటాల చాయమ్మ తదితరులకు కనగానపల్లిలోనూ, ఇదే మండలంలోని ముత్తువకుంట్ల గ్రామంలోనూ ప్రభుత్వ భూములు కేటాయించి, డీ పట్టాలు మంజూరు చేసి అధికారులు తమ స్వామి భక్తిని చాటుకున్నారు.

చెన్నేకొత్తపల్లి మండలంలో 
మేడాపురం– ఒంటికొండ, చెన్నేకొత్తపల్లి– ముష్టికోవెల, చెన్నేకొత్తపల్లి– వెంకటంపల్లి గ్రామాల్లో రూ.4 కోట్లతో తారు, సీసీ రోడ్ల పనులను మంత్రి సునీత చిన్నాన్న ఎల్‌.నారాయణ చౌదరి చేపట్టారు. నాణ్యత లేకుండా చేసిన ఈ పనుల్లో 40 శాతం నిధులు ఆయన జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం.  
నీరు–చెట్టు పథకం కింద రూ.30.8కోట్లతో 323 పనులు చేశారు. ఇందులో పనులు చేయకుండానే రూ.11 కోట్ల మేర సొమ్ము కాజేశారు.  

అనంతపురం రూరల్‌ మండలంలో 
అనంతపురం రూరల్‌ పరిధిలో భారీగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోంది. ఇక్క డ ఎవరు వెంచర్‌ వేయాలన్నా మంత్రి సునీత భర్త పరిటాల రవీంద్ర చిన్నాన్న∙కుమారుడు పరిటాల మహేంద్ర అనుమతి పొందితీరాలి. అతన్ని అన్ని విధాలుగా సంతోషపరిచిన తర్వాతనే ముందుకు వెళ్లాలి. లేకుంటే అన్నీ అడ్డంకులు సృష్టిస్తూ ఇబ్బంది పెడతారు.  
కురుగుంటలోని సర్వే నంబర్‌ 133–4లో మూడు ఎకరాల  ప్రభుత్వ స్థలంలో 60మందికి పట్టాలు ఇచ్చారు. మరో 45 పట్టాలను తన అనుచరుల ద్వారా ఒక్కో పట్టాకు రూ.2లక్షల చొప్పున వసూలు చేశారు. ఇక్కడ సెంటు భూమి రూ.8 లక్షలకు పైగా ధర పలుకుతోంది. అక్రమ మార్గల ద్వారా పరిటాల మహీంద్రనే సొమ్ము చేసుకున్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.  
విద్యారణ్య నగర్‌ సర్వే నంబర్‌ 106లోని 4.5 ఎకరాల స్థలాన్ని బ్యాంక్‌ వేలంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి దక్కించుకున్నాడు. అయితే ఈ స్థలంలో 30 ఏళ్లుగా  200 మంది పక్కా గృహాలు నిర్మించుకుని జీవిస్తున్నారు. దీంతో ఆ స్థలాన్ని సుబ్రహ్మణ్యం ఖాళీ చేయించలేకపోయారు. ఈ పంచాయితీలో పరిటాల కుటుంబీకులు జోక్యం చేసుకున్నారు. సెంటు విస్తీర్ణానికి కొంత మొత్తం చొప్పున చెల్లించి, పక్కా గృహాలు నిర్మించుకున్న 200 మందితో భారీగా డబ్బులు వసూలు చేసుకున్నారు.  
ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో సర్వే నంబర్‌ 343–2ఏలోని 70సెంట్ల స్థలాన్ని పరిటాల శ్రీరామ్‌ అనుచరుడు ఆక్రమించి ఇళ్లు కట్టారు. ఇక్కడ సెంటు భూమి విలువ రూ.4లక్షలు పైగా ఉంది. ఈ లెక్కన రూ.2.50కోట్ల విలువైన స్థలం కబ్జా చేసినట్లు తెలుస్తోంది.  
కక్కలపల్లి సమీపంలో ఓ వెంచర్‌ వేశారు. అనుమతి లేకుండా వెంచర్‌ వేశారంటూ నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తూ దుప్పటి పంచాయితీతో రూ. 3కోట్ల మేర వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఆత్మకూరు మండలంలో 
ఆత్మకూరు మండలంలో జరిగే ప్రతి పనిలో మంత్రి సునీత సోదరుడు బాలాజీకి కమీషన్‌ ఇవ్వాల్సిందే! ఆయనకు తెలీకుండా ఏ కాంట్రాక్టులు చేసేందుకు వీల్లేదు. గుడ్‌విల్‌ ఇ చ్చిన తర్వాతే పని ముందుకు కదులుతుంది.   
నీరు– చెట్టు పథకం కింద ఈ నాలుగేళ్లలో రూ.14 కోట్ల మేర విలువైన పనులు చేశారు. ఇందులో ఎలాంటి పనులు చేయకుండానే రూ.11 కోట్ల మేర బిల్లులను మంత్రి సునీత అండతో టీడీపీ నేతలు చేయించుకున్నారు.  
బి.యాలేరు, పంపనూరులో ఇళ్ల పట్టాల పేరుతో దళితుల భూములను స్వాధీనం చేసుకుని, టీడీపీ నాయకులే పట్టాలు చేయించుకున్నారు.
గాలిమరల కోసం వందల ఎకరాల భూములను రైతుల నుంచి తక్కువ ధరకు బాలాజీ కొనుగోలు చేసి వాటిని కంపెనీలకు ఎక్కువ ధరకు విక్రయించినట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. రైతులకు ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు చెల్లించి, కంపెనీ యాజమాన్యాలకు రూ.14 లక్షల వరకూ విక్రయించినట్లు తెలుస్తోంది.  

రాప్తాడు మండలంలో
రాప్తాడు మండలంలో నీరు–చెట్టు కింద 186 పనులకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో కొన్ని పనులు నాసిరకంగా ఉన్నాయి. పనులు చేయకుండానే రూ.13 కోట్ల మేర బిల్లులు కాజేశారు.  
జి.కొత్తపల్లి నుంచి పండమేరువంకపై నీరు–చెట్టు పథకం కింద రూ.28 లక్షలతో టీడీపీ నాయకులు కాలువను తవ్వారు. పనులు పూర్తి చేయకనే మొత్తం బిల్లులను మంజూరు చేయించుకున్నారు.  
ఒక్క మొక్క నాటకుండానే అవెన్యూ ప్లాంటేషన్‌ కింద రూ.3.5 కోట్లు నొక్కేశారు.
కనగానపల్లి మండలం కోనాపురం వద్ద ఉన్న హంద్రీ–నీవా కాలువ నుంచి రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి చెరువుకు నీటిని మళ్లించేందుకు రూ.8 కోట్లతో కాలువ పనులు చేపట్టారు. సొంతపార్టీ ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌ను కాదని తన సోదరుడు మురళికి ఈ పనులను మంత్రి సునీత కట్టబెట్టారు. ఈ పనులు నాణ్యత లేకుండా చేశారు. ఇందులో రూ.3.5కోట్లు మురళీ జేబులోకి చేరినట్లు ఆరోపణలున్నాయి.  
మరూరులో మూడు చెక్‌ డ్యాం పనులకు రూ.13లక్షలు, పైపులైన్‌ పనులకు మరో రూ.13 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులు అప్పటి సర్పంచ్‌ సాకే వెంకటేష్‌ పూర్తి చేయాల్సి ఉండగా, ‘గుడ్‌విల్‌’ ఇవ్వలేదంటూ పనులను మురళీ అడ్డుకుని, అదే గ్రామానికి చెందిన గోపాల్‌కు అప్పగించారు.  
ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం నుంచి మంత్రి కుటుంబీకులు రూ.40లక్షలు హఫ్తా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.  
దాదాపు 42 ఎకరాల్లో రాప్తాడు వద్ద ఏర్పాటు కానున్న ‘జాకీ’ ఫ్యాక్టరీ యాజమాన్యం ‘గుడ్‌విల్‌’ఇవ్వని కారణంగా పనులకు అంతరాయం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఈ పరిశ్రమ కాస్త తమిళనాడులోని సేలంకు తరలిపోయింది.  

కనగానపల్లి మండలంలో 
దాదులూరు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న నాదారు చెరువును టీడీపీ నేతలు ఆక్రమించారు. చెరువుకట్ట పైభాగంలో 594, 595 సర్వే నంబర్లలో కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో పట్టాలు తీసుకుని మంత్రి బంధువులు 30 ఎకరాల చెరువు మిగులు భూములనూ నొక్కేశారు.  
నీరు–చెట్టు ద్వారా టీడీపీ ప్రజాప్రతినిధులు రూ.5 కోట్ల మేర ప్రభుత్వ నిధులు కాజేశారు.
ప్రభుత్వ భూములకు టీడీపీ నేతలు పట్టాలు చేయించుకుని గాలిమరలు, సోలార్‌ ప్లాంట్లకు విక్రయిస్తున్నారు.  

రామగిరి మండలంలో 
మంత్రి సునీత అండతో వందల ఎకరాల డీకేటీ భూములను విక్రయించడం ద్వారా టీడీపీ నేత,  మాజీ ఎంపీపీ రంగయ్య రూ.కోట్లు కొల్లగొట్టినట్లు ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారు.
బెంగుళూరు హైవేలోని గంతిమర్రి, పెనుబోలు సరిహద్దుల్లోని డీ పట్టా భూములను పంజాబ్‌ వాసులకు, ప్రైవేటు కంపెనీలకు విక్రయించి భారీగా లబ్ధి పొందారు.
చెర్లోపల్లి, పాపిరెడ్డి పరిధిలో 300 ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలు పొంది వాటిని ప్రైవేటు కంపెనీలకు విక్రయించి రూ.కోట్ల దండుకున్నారు.  
రామగిరిలో గాలిమరలు, సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన భూమిని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, కంపెనీలకు ఎక్కువ మొత్తాలకు విక్రయించారు. ఈ వ్యవహారాలన్నీ మంత్రి తనయుడు పరిటాల శ్రీరామ్‌ కన్నుసన్నల్లోనే జరిగాయి.  

‘పరిటాల భవన్‌’ పేరుతో ఈ ఫొటోలో కన్పిస్తున్న టీడీపీ కార్యాలయం రాప్తాడు సమీపంలోని ఆటోనగర్‌లో నిర్మించారు. పండమేరు వేంకటరమణస్వామి ఆలయ మాన్యం భూమి ఇది! జిల్లా కేంద్రానికి సరిహద్దులో, బెంగుళూరు హైవే పక్కనే ఉన్న ఈ ప్రాంతంలో సెంటు ధర కనీసం రూ.10లక్షలు ఉంది. ఇక్కడ 45 సెంట్ల స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ ఆక్రమణ విలువ రూ.4.5 కోట్లకు పైగానే!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top