
బాబు... జీవిత కాలం సీఎంగా ఉండేందుకు కృషి చేస్తా
ఏపీ సీఎం చంద్రబాబు జీవిత కాలం సీఎంగా ఉండేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు జీవిత కాలం సీఎంగా ఉండేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేశినేని నాని మాట్లాడారు. నగరంలో అధికారులు, ప్రజా ప్రతినిధిల మధ్య సమన్వయలోపం ఉందని తాను వ్యాఖ్యానించి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఆ వ్యవహారంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగిస్తానని బాబు తనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సుజనా త్వరలో విజయవాడ వచ్చి ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెస్తారని చెప్పారు.
ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు పార్టీని నడుపుతున్నారని అన్నారు. అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు చేపట్టారని వివరించారు. 24 గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఏ వర్గాన్ని నిరాశపరచకుండా చంద్రబాబు పాలన సాగుతుందని తెలిపారు. కనకదుర్గ వారధికి కేంద్రం అనుమతి మంజూరు చేసిందని వెల్లడించారు. బెంజి సర్కిల్ వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు త్వరలో అనుమతులు మంజూరు అయ్యేలా చర్యలు చేపటనున్నట్లు కేశినేని నాని ఆశాభావం వ్యక్తం చేశారు.