అవును.. హిట్లర్‌కు తాతనే: సీఎం కేసీఆర్ | kcr says sensational comments | Sakshi
Sakshi News home page

అవును.. హిట్లర్‌కు తాతనే: సీఎం కేసీఆర్

Aug 18 2014 1:55 AM | Updated on Aug 15 2018 9:22 PM

అవును.. హిట్లర్‌కు తాతనే: సీఎం కేసీఆర్ - Sakshi

అవును.. హిట్లర్‌కు తాతనే: సీఎం కేసీఆర్

అవినీతిపై నేను హిట్లర్‌నే కాదు.. హిట్లర్ తాతను కూడా... ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు.

సాక్షి, హైదరాబాద్: ‘‘ అవినీతిపై నేను హిట్లర్‌నే కాదు.. హిట్లర్ తాతను కూడా... ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. తప్పుడు పనులు, ప్రజాధనాన్ని దోచుకునే వారిపట్ల హిట్లర్‌గానే వ్యవహరిస్తా... అన్యాయం అరికట్టడానికి ఎంతకైనా తెగిస్తా... మంచికోసం చేస్తే తప్పేమిటి..? ఎవరో ఏదో అన్నారని భయపడను. సకుటుంబ సర్వే ఎవరినో ఉద్దేశించి చేయడం లేదు... నిజమైన వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఓ సన్నాసి నోరుపెద్దగా చేసుకుని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడానికి సిగ్గుండాలి. ఈ పాపం అంతా ఎవరిది.. కేసీఆర్‌దా? మీ పాలనదా..? సిగ్గుతో తలదించుకోవాలి. మీ హయాంలో చేసిన పాపాలను కడిగేయడానికి ఈ సమయం చాలదు. మీది సంస్కారమేనా.?  హైదరాబాద్‌ను నేనే నిర్మించానన్న దానికి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం క్యాంప్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడిన కేసీఆర్ పలు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంతోపాటు, ప్రభుత్వ పథకాల అమలులో ఏవిధంగా వ్యవహరించనున్నారో స్పష్టం చేశారు.
 
 ఎస్సీ, ఎస్టీలకు 22 శాతం రిజర్వేషన్
 
 తెలంగాణ రాష్ర్టంలోని మార్కెట్ కమిటీలలో దళితులు, గిరిజనులకు 22 శాతం, బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో ఉన్న మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు,  డెరైక్టర్ పోస్టుల కోసం పెద్దఎత్తున పైరవీలు జరిగేవి, అయితే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేయనున్నట్లు చెప్పారు. అలాగే యూనివర్సిటీల పాలకమండళ్లు, సెనేట్ సభ్యులుగా వీరికి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పదవ తరగతి తరువాత కాలేజీలకు వెళ్లలేకపోతున్న దళిత బాలికల కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక హాస్టల్స్ నిర్మించనున్నట్లు తెలిపారు.
 
 గవర్నర్‌కు విశేషాధికారాలు లేవు..
 
 రాష్ట్ర విభజన తుది బిల్లు రూపకర్తలు గవర్నర్‌కు విశేషాధికారాలు ఏవీ కల్పించలేదు. హైదరాబాద్‌లో 40 లక్షల మంది ఉన్నారు. వారి రక్షణ అంటూ ఆంధ్రా నాయకులు మరీ ఒత్తిడి చేయడంతో రాజ్యాంగంలోని గవర్నర్లకు ఉండే అధికారాల సెక్షన్ 163 మేరకు అధికారాలు ఉంటాయి. దానినే విభజన చట్టంలో పెట్టారు తప్ప ప్రత్యేకాధికారాలు ఏవీ ఉండవు. అలా చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ అంటే.. విభజనచట్టం పాస్ కాదని నిర్ణయించి పైవిధంగా సర్దుబాటు చేశారు అంతే. అప్పుడు చట్టం చేసినప్పుడు మౌనంగానే ఉన్నాం. ఇప్పుడూ మౌనంగానే ఉన్నాం. రాజ్యాంగానికి మించి గవర్నర్‌కు అధికారాలు కల్పించాలంటూ కేంద్ర హోం శాఖ రాసిన రెండు లేఖలపై మేము స్పందించాం. వీటికి అంగీకరించేది లేదన్నాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఫాసిస్టు అనలేదు. ప్రభుత్వ ఫాసిస్టు చర్యగా మాత్రమే పేర్కొన్నాం.. కేంద్రం మాతో మంచిగా వ్యవహరిస్తే.. మేము వారితో మంచిగా ఉంటాం. వారు చెడ్డగా ఉంటే.. మేము చెడ్డగా వ్యవహరిస్తాం.. అని కేసీఆర్ పేర్కొన్నారు.
 
 మంచికోసం సర్వే చేస్తే తప్పేంటి..
 ‘నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకే సర్వే చేస్తుంటే కిషన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను విమర్శించడమే విజ్ఞత అనుకుంటున్నారు. అలా చేస్తే జోకర్లు అవుతారు. సర్వేకు స్థానికతకు సంబంధం లేదు. 1956 కంటే ముందున్నవారికే స్థానికత వర్తిస్తుందని ఇంతకుముందే ఉత్తర్వులు జారీచేశాం. ఇందులో దాచిపెట్టాల్సిందేమీలేదు. గుడ్డుపై ఈకలు పీకుతున్నారు. మూడు నెలలకే ప్రభుత్వంపై అక్కసు పెంచుకుని అప్పుడే బట్టలు చించుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ఇంకేం చించుకుంటారో అర్థం కావడం లేదు. కుటుంబాల కంటే రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి కంటే కట్టిన ఇళ్లు ఎక్కువ ఉన్నాయి. పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయింది. మా రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకమే లేదు. మా దగ్గర ఉన్నదల్లా.. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే పథకం. సర్వేపై హైకోర్టుకు వెళ్తే.. దానిని కొట్టేసింది. సర్వేలో బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం లేదు. చెబితే ప్రభుత్వ పథకాల డబ్బు నేరుగా మీ అకౌంట్లకే వస్తుంది. సర్వేరోజు వారు లేకపోతే పేర్లు తొలగిస్తామా..? చేర్చుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తాం’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement