ఎల్లో జర్నలిజానికి వ్యతిరేకంగా జర్నలిస్టుల ధర్నా

Dharna of Journalists Against Yellow Journalism in Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : ఎల్లో జర్నలిస్ట్‌ నాయకుల తీరును వ్యతిరేకిస్తూ ఎస్‌ఎస్‌సీఎమ్‌ (ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్‌, ముస్లిం మైనార్టీ జర్నలిస్ట్‌ సంఘం) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌ వద్ద జర్నలిస్టులు గురువారం నిరసన ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన 2430 జీవోకు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ ధర్నాకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాడి విష్ణులు హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌సీఎమ్‌ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజు మాట్లాడుతూ ఎల్లో జర్నలిజం సమాజానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు. 2430 జీవో పట్ల వ్యతిరేక వైఖరిని ఎల్లో జర్నలిస్ట్‌ సంఘాలు విడనాడాలని హితవు పలికారు. రాజకీయ రంగులద్దకుండా తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవోకు జర్నలిస్టులు మద్దతు తెలపడం శుభపరిణామమని, నీతిగా, నిజాయితీగా వార్తలు రాసేవారు ఈ జీవో పట్ల భయపడాల్సిన పనిలేదన్నారు.  ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసేవారికే ఈ జీవో ఇబ్బందికరంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అలాంటి పత్రికలు మేము తెలుగుదేశం పార్టీ పత్రికలం అని పేరు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. జర్నలిస్టులు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే దానికి ప్రభుత్వం వివరణ ఇస్తుందని, ఆ వివరణను కూడా పత్రికలు ప్రచురించాలని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేటప్పుడు పెద్దగా, ప్రభుత్వం ఇచ్చిన వివరణను చిన్నగా రాయడం భావ్యం కాదని సూచించారు. మంచిని మంచిగా, చెడును చెడుగా రాస్తే ఎలాంటి సమస్య ఉండదని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే మల్లాడి విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబును ప్రజలు తిరస్కరించినా యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నారనీ, ఇంగ్లీష్‌ మీడియంతో క్రిస్టియన్‌ మత ప్రచారం చేస్తున్నారని తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈ జీవో వల్ల వ్యక్తిగత ఎజెండా అమలు చేయాలని చూసే పత్రికలకు ఇబ్బందని విమర్శించారు. లోపాలను ఎత్తి చూపితే సరిచేసుకుంటాము. తప్పులు వార్తలు రాస్తే సహించమని హెచ్చరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top