కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఆరెపల్లి వద్ద సోమవారం శవాల గుట్టలు పేరుకుపోయాయి. కొడుకు-కోడలు పెళ్లిమొక్కు చెల్లిం చుకునేందుకు ఎములాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న...
- ఎములాడెళ్లకుండానే నిండు కుటుంబం బలి
- లారీ రూపంలో కబళించిన మృత్యువు
- కరీంనగర్ జిల్లా ఆరెపల్లిలో లారీ, ఆటో ఢీ
- పది మంది దుర్మరణం
- మూడు జంటలు.. కవలలు.. తల్లీకూతుళ్లు
కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఆరెపల్లి వద్ద సోమవారం శవాల గుట్టలు పేరుకుపోయాయి. కొడుకు-కోడలు పెళ్లిమొక్కు చెల్లిం చుకునేందుకు ఎములాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న కుటుంబమంతా మృత్యుదేవత ఒడిలోకి చేరిపోయింది. ఇసుక లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో పది మంది మృతిచెందారు. వీరందరూ వరంగల్ జిల్లావాసులే. శవాలను సిరిసిల్ల ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. విషయం తెలిసి వచ్చిన ఆత్మీయుల రోదనలతో అక్కడి వాతావరణం బరువెక్కింది.
ఈ ఘటనతో వరంగల్ కాశిబుగ్గ, కరీమాబాద్ బొమ్మలగుడి, ఒంటిమామిడిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నారుు. మృతుల్లో ఇద్దరు కవల పిల్లలతోపాటు తల్లిదండ్రులు, నూతన దంపతులు ఉన్నారు. ‘పిల్లలు పుట్టడం కోసం మొక్కని దేవుడు లేడు.. వెళ్లని ఆస్పత్రి లేదు. నా కొడుకుకు లేకలేక కవల పిల్లలు పుట్టారని సంతోషపడ్డా.. ఎంత పనిచేస్తివి దేవుడా.. నేనేం పాపం చేసిన.. నాకు నా వాళ్లని దూరం చేసినవు.. అంటూ కాశిబుగ్గలోని ఇంటి వద్ద కవల పిల్లల నాయనమ్మ రోదించిన తీరు అక్కడున్న వారి కంట కన్నీరు పెట్టించింది.