
సాక్షి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. శుక్రవారం విజయవాడలో జింఖానా గ్రౌండ్ నుంచి ధర్నా చౌక్ వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. అధికార అండతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. బీజేపీ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జనవరి 8వ తేదీన బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌కు పిలుపునిచ్చాయని తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఆయన కోరారు.