ఆర్‌యూలో ఇష్టారాజ్యం

Corruption In Rayalaseema University Kurnool - Sakshi

కర్నూలు(గాయత్రీ ఎస్టేట్‌): రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టళ్ల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. మెస్‌ బిల్లుల గురించి మాట్లాడితే విద్యార్థులు హడలిపోతున్నారు. ఇష్టానుసారం వసూలు చేస్తుండటంతో చెల్లించలేని స్థాయికి బకాయిలు చేరాయి. హాస్టళ్లలో ప్రొవిజన్స్, కూరగాయలు, చికెన్, పాలు, నీటి సరఫరాకు ఎలాంటి టెండర్లు లేకుండానే కొనుగోళ్ల కమిటీ (పర్చేజ్‌ కమిటీ) అనామతుగా కొని బిల్లులు చెల్లిస్తోంది. అధికారుల కక్కుర్తి కూడా తోడు కావటంతో విద్యార్థులకు బిల్లుల భారం తడిసి మోపెడవుతోంది. ఒక్క బిల్లులోనే రూ.77 వేలు అదనంగా చెక్‌ రాయగా.. అది కాస్తా బహిర్గతం కావడంతో క్యాన్సిల్‌ చేసి మరో చెక్కును సరుకుల సరఫరాదారులకు ఇచ్చారు. బయట పడటం వల్లే దాన్ని క్యాన్సిల్‌ చేశారు.

బయట పడనివి ఎన్నో ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. విద్యార్థులపై ఏటా రూ.10 లక్షల వరకు అదనంగా మెస్‌ బిల్లుల భారం పడుతోంది. వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి సరుకులు, కూరగాయలు, చికెన్, పాలు, తాగునీరు లాంటి వాటిని ఎలాంటి టెండర్లూ లేకుండానే కొనుగోలు చేస్తున్నారు. ఈ బిల్లుల చెల్లింపు సమయంలో వర్సిటీలోని కొందరు అధికారులకు భారీగా కమీషన్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. అలాగే సరుకులు, కూరగాయలు తదితర వస్తువులు సదరు అధికారుల ఇళ్లకు చేరటం పరిపాటిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
అటకెక్కిన విచారణ.. గత విద్యా సంవత్సరం హాస్టళ్లకు ప్రొవిజన్స్, కూరగాయల కొనుగోలు తదితర వాటిలో భారీగా అవినీతి జరిగిందని, దానిపై విచారణ  చేయించాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. దీంతో వర్సిటీ ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్‌యూ ఈసీ మెంబర్‌ ప్రొఫెసర్‌ సంజీవరావు, సీడీసీ డీన్‌ ప్రొఫెసర్‌ విశ్వనాథ«రెడ్డి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ సుబ్బారెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక సమర్పించలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఈ విద్యా సంవత్సరం ప్రొవిజన్స్, కూరగాయల సరఫరాకు టెండర్లు పిలిచారు. ప్రొవిజన్స్‌ సరఫరాకు కాంట్రాక్టర్‌ ముందుకొచ్చారు. సదరు కాంట్రాక్టర్‌ నాణ్యమైన సరుకులు సరఫరా చేయటం లేదని, తూకాల్లో వ్యత్యాసం ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కూరగాయల సరఫరాకు కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో గత ఏడాది మాదిరిగానే  కొనుగోలు చేస్తున్నారు.
  
తడిసి మోపెడవుతున్న మెస్‌ బిల్లులు  
రాయలసీమ విశ్వవిద్యాలయంలో మూడు మెన్‌ హాస్టళ్లు, రెండు ఉమెన్‌ హాస్టళ్లు ఉన్నాయి. గత ఏడాది  330 మంది విద్యార్థులు, 335 మంది విద్యార్థినులు హాస్టళ్లలో ఉన్నారు. నెలకు సరిపడా ప్రొవిజన్స్‌కు రూ.7 లక్షల వరకు ఖర్చవుతుంది. కూరగాయలు, పాలు, చికెన్‌ తదితర వాటికి రూ.5.50 లక్షల వరకు అవుతుంది. అబ్బాయిలకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,200, అమ్మాయిలకు రూ.1,700 వరకు బిల్లు వస్తోంది. కోర్సు, కేటగిరిని బట్టి వారికి స్కాలర్‌షిప్‌ ఏడాదికి రూ.5,400 నుంచి రూ.7,000 వరకు వస్తోంది. మిగతా మొత్తం చేతి నుంచి చెల్లించాల్సిందే. టెండర్ల ద్వారా ఏజెన్సీలను పిలిచి తక్కువ ధరకు సరుకులు, కూరగాయలు సరఫరా చేసే వారికి బాధ్యతలు అప్పగిస్తే విద్యార్థులపై మెస్‌ బిల్లుల భారం తగ్గుతుందని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. నిబంధనల ప్రకారం హాస్టళ్లను నిర్వహిస్తే ఏడాదికి రూ.10 లక్షల వరకు భారం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. 

విచారణ కమిటీ వేశాం 
హాస్టళ్లలో అవినీతిపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించాం. ఈ నెల 24లోగా విచారణ పూర్తి చేసి రిపోర్ట్‌ ఇవ్వాలి. హాస్టళ్లలో అవినీతి జరిగిందని విద్యార్థులు ఆందోళనలు చేపట్టడంతో పాటు ఫిర్యాదు కూడా చేశారు. వారి వినతి మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేశాం. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ప్రొవిజన్స్‌ కాంట్రాక్టర్‌ సరిగా సరఫరా చేయటం లేదనే ఆరోపణలున్నాయి. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం.   – ప్రొఫెసర్‌ అమర్‌నాథ్, రిజిస్ట్రార్, ఆర్‌యూ  

నివేదిక ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది 
ఆర్‌యూ హాస్టళ్ల నిర్వహణలో రూ.లక్షల్లో అవినీతి జరిగింది. దీనిపై నియమించిన విచా రణ కమిటీ నివేదికను ఇంతవరకు ఇవ్వకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. కమిటీలు నామమాత్రంగా వేస్తున్నారు కానీ విచారణ పక్కాగా జరగటం లేదు.  విద్యార్థులకు రూ.వేలల్లో మెస్‌ బిల్లులు వస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవటంతో  ఇలా జరుగుతోంది. అధికారులు స్పందించి ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారం నిర్వహిస్తే ఎలాంటి  అక్రమాలూ జరగవు.  – సూర్య, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు  

కమిటీలు కాగితాలకే పరిమితం 
వర్సిటీలో అవినీతి, అక్రమాలు, అవకతవకలపై వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. హాస్టళ్లలో అవినీతిపై కమిటీని నియమించి నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. దీన్ని బట్టి చూస్తే అధికారులు అందరూ కుమ్మక్కు అయినట్లు అర్థమవుతోంది. విచారణ చేపట్టి వాస్తవాలు బయటికి తీస్తే విద్యార్థుల్లో ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి. వర్సిటీ అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టి నిజాలను బయట పెట్టాలి. లేకపోతే ఆందోళనకు సిద్ధమవుతాం.  – శ్రీరాములు, ఆర్‌యూ విద్యార్థి జేఏసీ కన్వీనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top