గళమెత్తిన బ్యాంకు ఉద్యోగులు | Bank Unions Protest In Front Of SBI Over Merging National Banks In West Godavari | Sakshi
Sakshi News home page

గళమెత్తిన బ్యాంకు ఉద్యోగులు

Oct 23 2019 10:03 AM | Updated on Oct 23 2019 10:04 AM

Bank Unions Protest In Front Of SBI Over Merging National Banks In West Godavari - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): జాతీయ బ్యాంకుల విలీన ప్రక్రియను నిరసిస్తూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు బ్యాంకింగ్‌ రంగాన్ని పరిరక్షించాలంటూ ప్రదర్శనలు చేశారు. బ్యాంకుల ఎదుట డిమాండ్లతో కూడిన నినాదాలతో ధర్నా చేశారు. సమ్మెలో ఉన్న బ్యాంకు ఉద్యోగులు బృందాలుగా బయలుదేరి పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను మూయించివేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె ప్రభావం బ్యాంకుల లావాదేవీలపై పడింది. ప్రధాన బ్యాంకులుగా ఉన్న స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రాబ్యాంకులు సమ్మెలో ఉండటంతో ప్రధానంగా ఈ బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలకు విఘాతం కలిగింది. ఏటీఎంలు మాత్రం పనిచేశాయి. వందల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు సాగలేదు. ఏ కార్యకలాపాలు జరుగకుండా బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులు వాహనాలలో బ్యాంకుల వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. పనిచేస్తున్న బ్యాంకులను మూయించారు. జిల్లాలోని దాదాపు అన్ని పట్టణాలలో బ్యాంకుల లావాదేవీలకు అవరోధం ఏర్పడింది.
 
బ్యాంకింగ్‌ రంగాన్ని పరరక్షించుకోవాలి 
బ్యాంకింగ్‌ రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, ప్రజలు కూడా ఈ విషయంలో బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించాలని సమ్మె సందర్భంగా తాడేపల్లిగూడెంలో ధర్నాలు, ప్రదర్శనలు చేసిన నాయకులు కోరారు. తాడేపల్లిగూడెం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద జరిగిన ప్రదర్శనను ఉద్దేశించి నాయకులు ప్రసంగించారు. నాయకులు మాట్లాడుతూ 135 కోట్ల జనాభాకల దేశం, దీంతో పాటు వ్యవసాయరంగం ప్రధానమైన దేశంలో ప్రజలకు సేవల కోసం బ్యాంకు శాఖలను విస్తరించాల్సి ఉందన్నారు. బ్యాంకు శాఖలు విస్తరించాల్సింది పోయి బ్యాంకుల విలీనాల వల్ల వేల సంఖ్యలో బ్రాంచిలు మూతపడతాయన్నారు. ఒక పక్క మొండి బకాయిల పేరుతో లక్షల కోట్లు కార్పొరేట్‌ , బడా పారిశ్రామిక వేత్తలకు రుణాలు రద్దు చేయడానికి ఉత్సాహపడుతున్న ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ లేదని నాయకులు విమర్శించారు. సామాన్య ఖాతాదారులు బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్లుగా దాచుకొనే వారైతే, బడా కార్పొరేట్లు లక్షల కోట్లు రుణాలు తీసుకొని ఎగవేస్తున్నారన్నారు.

సామాన్యులు దాచుకొనే డిపాజిట్లపై వడ్డీలు తగ్గించడం దారుణమన్నారు. బడా వ్యాపారులకు వడ్డీరేట్లు తగ్గించడం వారికి లాభదాయకమన్నారు. డిపాజిట్లపై వడ్డీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. మొండి బకాయిల రికవరీకి చట్ట సవరణ చేయాలని కోరారు. బ్యాంకు విలీనాల ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకుల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రిటైర్టు ఉద్యోగులకు పెన్షన్‌ రివైజ్‌ చేయాలని, ఉద్యోగుల మెడికల్‌ ఇన్సూ్యరెన్సు ప్రీమియం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాఫ్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి తోట సూర్యనారాయణ, కో–ఆర్డినేషన్‌ కమిటీ సీనియర్‌ నాయకులు ఎస్‌ఎస్‌ ప్రసాద్, సెంట్రల్‌ బ్యాంకు యూనియన్‌ నాయకులు వీఎల్‌ఎన్‌ శాస్త్రి, బి.ఏడుకొండలు, పాలూరి సత్యనారాయణ, శీతాళం నారాయణమూర్తి, కుమారస్వామి తదితరులు నాయకత్వం వహించారు.

తాడేపల్లిగూడెం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ధర్నా చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement