ఒకే అభ్యర్థి.. 3 జిల్లా ర్యాంకులు

AP Grama Sachivalayam Results Kurnool Youth Gets Three Ranks - Sakshi

బనగానపల్లె/ముమ్మిడివరం: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు గ్రామానికి చెందిన బెడదల రాజశేఖర్‌రెడ్డి సచివాలయ పరీక్షల్లో జిల్లా స్థాయిలో మూడు ర్యాంకులు సాధించి సత్తా చాటాడు. కేటగిరీ–2 గ్రూప్‌–ఏలో 106.75 మార్కులతో జిల్లాలో 8వ ర్యాంకు సాధించి ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేటగిరీ–2 గ్రూప్‌ బీలో 109.25 మార్కులతో జిల్లాలో 4వ ర్యాంకు సాధించి.. సర్వేయర్, వీఆర్వో పోస్టులకు ఎంపికయ్యాడు. అలాగే కేటగిరీ–3లో 80 మార్కులతో జిల్లాలో 9వ ర్యాంకు సాధించి వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ పోస్టుకు ఎంపికయ్యాడు.

తాను వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ పోస్టులో చేరనున్నట్లు రాజశేఖర్‌రెడ్డి తెలిపాడు. రాజశేఖర్‌ 1–10వ తరగతి వరకు మండలంలోని ఇల్లూరుకొత్తపేట గ్రామంలోని పెండేకంటి పబ్లిక్‌ స్కూల్లో, ఇంటర్‌ గుంటూరులోని శ్రీచైతన్యలో, బీటెక్‌ కర్నూలు జి.పుల్లారెడ్డి కళాశాలలో, ఎంటెక్‌ ఎన్‌ఐఐ తిరుచ్చిలో చదివాడు. ఇతని తల్లిదండ్రులు బెడదల అచ్చమ్మ, బెడదల నారాయణరెడ్డి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.

‘తూర్పు’లో సురేష్‌కు ప్రథమ ర్యాంకు: గ్రామ సచివాలయ పరీక్షల్లో మత్స్యశాఖ సహాయకుల ఉద్యోగ విభాగంలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం సీహెచ్‌ గున్నేపల్లికి చెందిన గాలిదేవర సురేష్‌ 97.25 మార్కులు సాధించి జిల్లాలో ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. సురేష్‌ తండ్రి జీవీ.కృష్ణారావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి భద్రకాళీ మాణిక్యాంబ గృహిణి. తండ్రి ప్రోత్సాహం, ప్రభుత్వం నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు సురేష్‌ తెలిపాడు.

సురేష్‌ ముమ్మిడివరం ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్య, అమలాపురంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. నెల్లూరు జిల్లా ముత్కూరు కాలేజీ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ చేశాడు. ఎంఎఫ్‌ఎస్‌సీ పోస్టు గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు రాశాడు. సీఎం వైఎస్‌ జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో తమ లాంటి అర్హులకు ఉద్యోగాలు వస్తున్నాయని సురేష్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top