ఉగాదికి ఉషస్సు

AP Government Will Giving Home Lands For Poor People To This Ugadi    - Sakshi

ఏళ్ల తరబడి ఒక్కో ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు.. ముగ్గురు ఇంట్లో ఉంటే నలుగురు బయట ఉండాలి. నలుగురి కడుపు నిండితే ఇద్దరు పస్తులుండాలి. గత ఐదేళ్లుగా ఇదీ నిరుపేదల జీవన చిత్రం. ఎక్కడైనా కాస్త జాగా ఇస్తే చిన్న గుడిసె వేసుకుని బతుకుతామంటూ కనిపించిన ప్రతి ప్రజాప్రతినిధినీ వేడుకున్నారు. మీరైనా కనికరించండయ్యా అంటూ అధికారులకు చేతులెత్తి దండాలు పెట్టారు. పట్టించుకున్న దిక్కులేదు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నోరెత్తి అడగాల్సిన పని లేదు.. ఎందుకంటే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి బాధలను కళ్లారా చూశారు. మనసుతో విన్నారు. అందుకే ఉగాది పర్వదినాన ప్రతి పేద వానికీ నివేశన స్థలం ఇచ్చేందుకు నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే 1.35 లక్షల మంది నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను గుర్తించి ఉగాదినాటికి బడుగుల జీవితాల్లో ఉషస్సు నింపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు: అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో గ్రామీణ, నగర, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి నిరుపేద మహిళలు తరలిరావటంతో దరఖాస్తులు తీసుకొనేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరిగి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వాటిని తహసీల్దార్లు పరిశీలించి అర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 75 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో 60 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంటి స్థలాల అర్హుల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి వివరాలు తీసుకుంటున్నారు. అనంతరం అర్హుల తుది జాబితాలను వెల్లడించనున్నారు.  

గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు 
గుంటూరు నగరం, మున్సిపాలిటీలో జరుగుతున్న వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేవో చూసుకుంటున్నారు. నగరంలో కొన్ని వార్డుల్లో వలంటీర్లు, కార్పొరేషన్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు తీసుకోకపోవడంతోనే గ్రామసభలకు దరఖాస్తులు అధికంగా వస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సభలు పూర్తయ్యే సరికి గుంటూరులో దాదాపు 50 వేలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. వీటి పరిశీలనకు నగరపాలక సంస్థలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మిగిలిన మున్సిపాలిటీల్లో 40 వేలకుపైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇస్తామని, జనవరి వరకు దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పిస్తామని గురువారం ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. దీంతో జిల్లాలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.  

అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు 
ఇంటి స్థలాల కోసం అర్హులైన జాబితాలను సిద్ధం చేస్తున్నాం. ఇందు కోసం అవసరమైన ప్రభుత్వ స్థలాలు గుర్తిస్తున్నాం. ఇప్పటికే అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములను రెవెన్యూ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేటు భూములు సేకరిస్తాం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 
– దినేష్‌ కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ గుంటూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top