మంగళగిరి, తాడేపల్లికి మహర్దశ

Alla Rama Krishna Developing Tadepalli Amaravati Municipality Jointly - Sakshi

రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు

 రెండింటినీ కలిపి మహానగరంగా రూపొందించాలని ఎమ్మెల్యే ఆర్కే సూచన

సాక్షి, తాడేపల్లి(గుంటూరు) : నియోజకవర్గంలోని మంగళగిరి, తాడేపల్లి  మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఈ రెండు మున్సిపాలిటీలను కలిపి అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. తాడేపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎన్‌ దినేష్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను వేర్వేరుగా చూడొద్దని రెండింటినీ కలిపి చుట్టుపక్కల గ్రామాలతో భవిష్యత్‌ తరాలకు మంచి సౌకర్యాలతో ఉండే విధంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ రెండు మున్సిపాలిటీలను కలిపి మహానగరంగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇప్పటినుంచే అభివృద్ధి చేసే పనులు కొన్ని రెండింటికీ కలిపి నిర్వహిస్తే ప్రభుత్వానికి ఎంతో భారం తగ్గుతుందన్నారు.

ముఖ్యంగా తాగునీరు రెండు మున్సిపాలిటీలకు అవసరమని దానికి సంబంధించి కృష్ణానదినుంచి రా వాటర్‌ తీసుకుని ఫిల్టర్‌ చేయించి గ్రావిటీ ద్వారా రెండు మున్సిపాలిటీలకు అందించడం, డంపింగ్‌ యార్డును ఒకేచోట ఏర్పాటుచేయడం లాంటి పనులను గుర్తించి ఉమ్మడిగా చేస్తే ప్రభుత్వానికి చాలా ఖర్చు తగ్గుతుంది. విజయవాడ తరువాత రైల్వేలైన్‌లు అభివృద్ధి చెందేది తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలోనేనని దానికి సంబంధించి కూడా రైల్వే వారితో చర్చించి ఎక్కడెక్కడ బ్రిడ్జిలు కావాలి, ఎంత ఖర్చుపెట్టాలి అనే ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. బకింగ్‌హామ్‌ కెనాల్‌పై కొత్త బ్రిడ్జి నిర్మాణం, కొత్త రోడ్ల నిర్మాణం వాటి వలన కలిగే లాభనష్టాలు అన్నీ ముందుగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఎవరి నివాసం తొలగించినా ముందస్తుగా వారికి నివాసాలు కేటాయించి మాత్రమే అభివృద్ధి పనులు చేసే విధంగా చూడాలని అధికారులను ఆయన కోరారు.


అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే

తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలో రెయిన్‌ ఫాల్స్‌తో నిండే చెరువులున్నాయని, వాటిని రెయిన్‌ఫాల్స్‌తో నింపి భూగర్భ జలా లను పెంచే విధంగా కృషి చేయాలని సూచిం చారు. కొండ ప్రాంతాల్లో అటవీ భూములను వినియోగించుకోకుండా ప్రత్యామ్నాయ స్థలాలను ఎన్నుకునేలా చూడాలన్నారు. వీలైనంత వరకు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలకు ఉమ్మడిగా ప్రణాళిక రూపొందిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. సమీక్ష సమావేశంలో తాడేపల్లి మున్సిపల్‌ కమీషనర్‌ రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top