‘మెడ్‌టెక్‌’లో భూముల పందేరం 

1350 crore worth lands to Companies - Sakshi

రూ.1,350 కోట్ల విలువైన భూములు పప్పుబెల్లాల్లా పంపకం

ఊరూపేరూ లేని కంపెనీలకు కట్టబెట్టిన వైనం

గోప్యంగా పెట్టుబడులు, ఎంఓయూలు

విశాఖ ‘మెడికల్‌ పార్క్‌’లో అన్నీ అక్రమాలే

ఇప్పటికే రూ.43 కోట్లు అడ్వాన్సు కింద ఎగరేసుకుపోయిన లగడపాటి

తర్వాత ఆ సంస్థ కాంట్రాక్టు రద్దు.. 

అడ్వాన్సు తిరిగివ్వకున్నా చర్యల్లేవు  

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో వైద్య పరికరాల తయారీ పేరిట ఏర్పాటు చేసిన ‘మెడ్‌టెక్‌ జోన్‌’ అక్రమాలకు ఆలవాలమైంది. దీనికోసం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆనుకుని కేటాయించిన అత్యంత విలువైన 270 ఎకరాల ప్రభుత్వ భూమిని పందేరం చేసే కార్యక్రమం విచ్చలవిడిగా జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మెడికల్‌ డివైజెస్‌ టెక్నాలజీ పార్క్‌(ఏఎంటీజెడ్‌–మెడ్‌టెక్‌ జోన్‌) పేరుతో జరుగుతున్న ఈ భూపందేరానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఎవరికి పడితే వారికి పప్పులు, బెల్లానికి ఈ భూమిని కట్టబెడుతున్నారు. దాదాపు రూ.1,350 కోట్ల విలువ చేసే ఈ భూమిపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు.. ఫ్యాక్టరీలు పెడుతున్నారన్న పేరిట తమకు కావాల్సిన వారికి అతి తక్కువ ధరకు లీజుకు అప్పగిస్తున్నారు. ఊరూపేరు లేని కంపెనీలకు, కనీసం టర్నోవర్‌ కూడా చూపించని వాటికి కట్టబెడుతున్నారు. తద్వారా భారీగా ముడుపులు దండుకుంటున్నారు. 

అతి తక్కువ ధరకు లీజుకు... 
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అంటే ఆసియాలోనే పెద్ద పేరున్న పరిశ్రమ. దానికి పక్కనే 270 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరం కనిష్టంగా రూ.5 కోట్లు విలువ ఉంది. తద్వారా మొత్తం భూమి రూ.1,350 కోట్ల విలువ చేస్తుంది. అలాంటి ఈ భూమిని ప్రభుత్వ పెద్దలు ఫ్యాక్టరీలు పెడుతున్నారన్న పేరుతో తమకు కావాల్సిన వారికి ఎకరం రూ.పాతిక లక్షలకంటే తక్కువకే 33 ఏళ్ల లీజుకు ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ పరిశ్రమలు పెడతామని వచ్చిన కంపెనీలకు ఊరూపేరూ లేదు. ఎక్కడా టర్నోవర్‌ చూపించట్లేదు. అలాంటివాటితో సంప్రదింపులు జరిపి ఎంఓయూలు చేసుకోవడం, భూములు ఇచ్చేయడం ద్వారా భారీ ఎత్తున కమీషన్లు కొట్టేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఐఏఎస్‌ అధికారుల్ని సీఈవోలుగా నియమిస్తే అన్యాయాల్ని ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో ఓ ముఖ్యనేత ఒక కన్సల్టెంట్‌ను సీఈఓగా నియమించి భారీస్థాయిలో దందా నడిపిస్తున్నారు. ఇది ఐఏఎస్‌ అధికారుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.  

రూ.5 వేల కోట్లు పెట్టుబడులు.. 20 వేల ఉద్యోగాలు ఎక్కడ? 
రాష్ట్రంలో వైద్య ఉపకరణాల రేట్లు భారీగా ఉన్నాయని, అవి ఇక్కడే తయారైతే భారీగా రేట్లు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు వల్ల రూ.5 వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, 20 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అయితే ఇప్పటివరకు అక్కడ ఆరు షెడ్లు మాత్రమే నిర్మించారు. ఏ ఒక్క కంపెనీ ఇప్పటివరకూ నిర్మాణాలు మొదలుపెట్టలేదు. రూ.1,350 కోట్ల విలువైన భూమిని తీసుకుని కనీసం 13 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఏ కంపెనీలు ఎంత పెట్టుబడి పెట్టాయి, వాటికి ఎక్కడ ఎన్ని ఎకరాలు కేటాయించారు అన్నదీ గోప్యంగా ఉంచారు. మెడ్‌టెక్‌ జోన్‌ నిర్మాణాలు చేసే బాధ్యత కూడా ఎలాంటి టెండర్లు పిలవకుండా పవర్‌మెక్‌ అనే కంపెనీకి కట్టబెట్టారు. ఇక్కడ మెడికల్‌ డివైజెస్‌ కంపెనీలు వస్తున్నాయంటూ రాష్ట్రంలో మూడున్నరేళ్లలో వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు.

ఇక్కడ ఫలానా కంపెనీ పెట్టుబడి పెడుతోంది.. అది చెప్పినచోట కొనాలని షరతు పెట్టారు. ఉదాహరణకు ఒక హిమోగ్లోబిన్‌ మీటర్‌ రూ.1,500 వాస్తవ ధర అయితే, దాన్ని రూ.16,500కు ప్రభుత్వంతో కొనిపించారు. ఇలా అధిక ధరలు చెల్లించడంవల్ల రాష్ట్రంలో మూడున్నరేళ్లలో కనీసం రూ.150 కోట్లు అధికంగా చెల్లించినట్టు అంచనా. ఇప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద నిర్వహణ బాధ్యతలు తీసుకున్న సర్వీస్‌ ప్రొవైడర్లను బెదిరించి కావాల్సిన వైద్యపరికరాలన్నింటినీ 50 రెట్లు అధిక ధరలకు కొనిపిస్తున్నారు. టెండర్లన్నీ మెడ్‌టెక్‌ జోన్‌ సీఈవో తయారు చేయడం, ఏ కంపెనీకి రావాలో అందులోనే నిర్ణయించడం, పనులు ఇవ్వడం, చెప్పినచోట ఎక్కువ రేటుకైనా కొనిపించడం.. వెరసి ఖజానాకు భారీగా దెబ్బపడింది. తక్కువ ధరకు వచ్చే వైద్య పరికరాల్ని దగ్గరుండి ఎక్కువ ధరకు కొనిపించి కమీషన్లు కొట్టేసిన వైనం కళ్లముందే జరుగుతున్నా ముఖ్యనేత ప్రమేయం ఉండటంతో కిమ్మనకుండా అన్నీ జరిగిపోయాయి. 

లగడపాటిపై ఎందుకంత ప్రేమ? 
మెడ్‌టెక్‌ జోన్‌ నిర్మాణం పనులు 2016లో లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థకు అప్పజెప్పారు. అప్పటికే ఈ సంస్థ రిమ్స్‌ల నిర్మాణం సకాలంలో చెయ్యలేకపోయారని ప్రభుత్వమే ఆ సంస్థకు పెనాల్టీ వేసి, కాంట్రాక్టు రద్దు చేసింది. అలాంటి సంస్థనే తెరమీదకు తెచ్చి పనులు కట్టబెట్టారు. వాస్తవానికి ఈ అభివృద్ధి పనులు డీపీఆర్‌ ప్రకారం రూ.708 కోట్లు ఉండగా.. అంచనాలు భారీగా పెంచి రూ.2,435 కోట్లు చేశారు. ల్యాంకోకు పనులు అప్పజెప్పడమేగాక రూ.43 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద ఇచ్చారు. తర్వాత ఈ సంస్థపై పలు ఆరోపణలు రావడం, దీనిపై వివిధ మీడియాల్లో కథనాలు రావడంతో ల్యాంకోకు పనులు రద్దుచేశారు. కానీ మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద ఇచ్చిన నిధులను మాత్రం ల్యాంకో తిరిగివ్వలేదు. ఈ నిధులు రాబట్టడానికి ప్రభుత్వమూ కసరత్తు చేయలేదు. మెడ్‌టెక్‌ జోన్‌ పార్కులో మొదట్నుంచే అవినీతి పర్వం కొనసాగుతున్నదనేందుకు ఇది నిదర్శనం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top