కొలువుదీరిన తాండూరు పాలకవర్గం | - | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన తాండూరు పాలకవర్గం

Feb 17 2026 8:56 AM | Updated on Feb 17 2026 8:56 AM

కొలువుదీరిన తాండూరు పాలకవర్గం

కొలువుదీరిన తాండూరు పాలకవర్గం

చైర్‌పర్సన్‌గా పట్లోల్ల నీరజాబాల్‌రెడ్డి

వైస్‌ చైర్మన్‌గా అబ్దుల్‌రజాక్‌

తాండూరు: మున్సిపల్‌ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం సోమవారం ప్రశాంతంగా ముగిసింది. తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య పర్యవేక్షణలో పోలీసులు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ముడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఫలితాల అనంతరం క్యాంపునకు తరలిన కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఎన్నికల హాల్‌లోకి కేవలం కౌన్సిలర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అనంతరం 36 మంది కౌన్సిలర్లకుగాను కాంగ్రెస్‌ నుంచి 19, బీఆర్‌ఎస్‌ నుంచి 11, ఎంఐఎం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థితో కలిపి మొత్తం 32 ప్రమాణం చేశారు. ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు ఈ నెల 18న ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తామని కౌన్సిల్‌ హాల్‌నుంచి వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 25వ వార్డు కౌన్సిలర్‌ నసీరాబేగం వ్యక్తిగత కారణాలతో ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. అనంతరం చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. కాగా ఈ ప్రక్రియను బీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది. ఎన్నికల కౌటింగ్‌ సరిగా నిర్వహించకుండా మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వాకౌట్‌ చేశారు. మిగిలిన 21 మంది కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిలతో కలిపి 22 మంది సభ్యులు ఎన్నికలో పాల్గొన్నారు. చైర్‌పర్సన్‌గా పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డిని కౌన్సిలర్‌ అబ్దుల్‌ రజాక్‌ ప్రతిపాదించగా సభ్యులు రామకృష్ణ బలపర్చాడు. అలాగే వైస్‌ చైర్మన్‌గా అబ్దుల్‌ రజాక్‌ను బంటు వేణుగోపాల్‌ ప్రతిపాదించగా వెంకటేశ్‌ బలపర్చారు. దీంతో ప్రమాణ స్వీకార ఘట్టం ముగిసింది.

రెండేళ్ల పాలనకు రెఫరండం: ఎమ్మెల్యే

నా రెండేళ్ల పాలనకు ఈ మున్సిపల్‌ ఎన్నికలే రెఫరండమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ మేరకు త్వరలో రూ.వేయి కోట్ల నిధులను మంజూరు చేయించి తాండూరు మున్సిపాలిటీలో యూజీడీ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికై న చైర్‌ పర్సన్‌,వైస్‌ చైర్మన్‌ లతో పాటు కౌన్సిల్‌ సభ్యులతో కలిసి తాండూరు మున్సిపల్‌ అభివృద్దికి పాటుపడతామన్నారు. ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధంచేశామన్నారు. నూతనంగా ఎన్నికై న చైర్‌ పర్సన్‌ నీరజాబాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ రజాక్‌కు ఎమ్మెల్యే శుభాకంక్షాలు తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని ఎన్నికల తర్వాత అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లాలని కౌన్సిల్‌ సభ్యులకు సూచించారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వాకౌట్‌ చేయడం వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు.

బాధ్యతగా విధులు నిర్వహిస్తా

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ఇచ్చిన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహిస్తాను. తనపై నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చిన 29వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. – అబ్దుల్‌ రజాక్‌, వైస్‌ చైర్మన్‌, తాండూరు మున్సిపల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement