హత్యాయత్నం కేసులో ఏడుగురికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో ఏడుగురికి రిమాండ్‌

Feb 17 2026 8:56 AM | Updated on Feb 17 2026 8:56 AM

హత్యాయత్నం కేసులో ఏడుగురికి రిమాండ్‌

హత్యాయత్నం కేసులో ఏడుగురికి రిమాండ్‌

వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి

నిందితుల్లో కరడుగట్టినరౌడీషీటర్‌ అసద్‌

పహాడీషరీఫ్‌: డబ్బుల కోసం వ్యాపారిని నిర్బందించి, హత్య చేసేందుకు యత్నించిన ఘటనలో కరుడుగట్టిన రౌడీషీటర్‌తో పాటు ఆరుగురు గ్యాంగ్‌ సభ్యులను బాలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ ఎం.సుధాకర్‌తో కలిసి ఆదిబట్ల ఏసీపీ డీవీ ప్రదీప్‌ కుమార్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ అసద్‌ (32)మత్తు కోసం ట్యాబ్లెట్లు వాడుతూ నిషాలో సామాన్య ప్రజలను కత్తులతో బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇతనిపై పోలీస్‌ కమిషనర్‌ నగర బహిష్కరణ విధించారు. ఆ నిబంధనలను సైతం బేఖాతర్‌ చేస్తూ ఆరు నెలల క్రితం తన మకాంను బాలాపూర్‌ క్యూబా కాలనీలో నివాసం ఉండే తండ్రి వద్దకు మార్చాడు. రౌడీషీట్‌ కూడా బాలాపూర్‌కు బదిలీ అయ్యింది. ఇక్కడ దోపిడీలు, దాడులకు పాల్పడి నిజామాబాద్‌లోని అత్తగారింటి వద్ద తలదాచుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ఈ నెల 10న కాలాపత్తర్‌కు చెందిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సెకండ్‌ సేల్‌ వ్యాపారి సయ్యద్‌ మొహియుద్దీన్‌ అలియాస్‌ ఖాజా తన వర్కర్‌ ముస్తఫాతో కలిసి సుల్తాన్‌పూర్‌లోని గోడౌన్‌కు వచ్చాడు. పని ముగించుకొని రాత్రి 8 గంటల సమయంలో సమీపంలోని అలీషాన్‌ హోటల్‌ వద్దకు రాగానే రౌడీషీటర్‌ అసద్‌ తన అనుచరులైన మాదన్నపేట రౌడీషీటర్‌ సైఫ్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌, జహంగీర్‌(23), ఫర్హాన్‌ నవాజ్‌(26), మహ్మద్‌ సయీద్‌(19), మహ్మద్‌ అల్తాఫ్‌(27), మహ్మద్‌ ఇక్బాల్‌ మొయియుద్దీన్‌(42), ఖుద్దూస్‌ బస్రావి(30)లతో కలిసి ఇద్దరిని బలవంతంగా షాహిన్‌నగర్‌ సగ్గాప్‌ కాలనీలోని ఓ ఇంట్లో నిర్బందించి, రూ.1 లక్ష ఇవ్వాలని, లేకుంటే చంపేస్తానని కత్తులతో బెదిరించాడు. బాధితుడు తన వ ద్ద లేవని తేల్చిచెప్పడంతో ఇష్టానుసారం దాడి చేశారు. నిందితుల నుంచి తప్పించుకున్న మొహియుద్దీన్‌ మరుసటి రోజు తెల్ల వారుజామున బాలాపూర్‌ పీఎస్‌లో ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు నిందితులు సైఫ్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌ పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి ఆరు సెల్‌ఫోన్లు, ఒక చిన్న కత్తి, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక గొడ్డలి, మూడు కత్తులు, ఒక వేట కొడవలి స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల నేర చరిత్రకనుగుణంగా రౌడీషీట్‌, పీడీ యాక్ట్‌ కోసం ప్రతిపాదనలు పంపుతామని ఏసీపీ తెలిపారు.

ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు

ప్రధాన నిందితుడైన రౌడీషీటర్‌ అసద్‌పై 15 కేసులు నమోదై ఉన్నాయి. బాలాపూర్‌లో మొహియుద్దీన్‌పై దాడి చేసిన రోజే తన అనుచరులతో కలిసి కాలాపత్తర్‌లోని కిరాణ షాప్‌ నిర్వాహకుడు సిద్ధిఖీపై కూడా కత్తులతో బహిరంగంగా దాడికి పాల్పడ్డాడు. ఇతనిపై ఇప్పటి వరకు 15 కేసులు (కాలాపత్తర్‌– 10, శాలిబండ– 2, బండ్లగూడ–1, సిరికొండ–1, నిజామాబాద్‌ వన్‌టౌన్‌ పీఎస్‌–1) నమోదై ఉన్నాయి. పరారీలో ఉన్న మరో నిందితుడైన మాదన్నపేట రౌడీషీటర్‌ సైఫ్‌ ఖాన్‌పై డబీర్‌పురాలో– 3, మలక్‌పేట్‌లో ఒక కేసు నమోదై ఉన్నాయి. మూడో నిందితుడు మహ్మద్‌ ఇమ్రాన్‌పై 13 కేసులు(కాలాపత్తర్‌– 7, మైలార్‌దేవ్‌పల్లి–1, నాంపల్లి–1, మధ్యప్రదేశ్‌ భూపాల్‌– 1, కుల్సుంపురా–1, బహదూర్‌పురా–1, సైబర్‌ క్రైమ్స్‌–1)నమోదై ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement