పదవి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

పదవి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాం

Feb 17 2026 8:56 AM | Updated on Feb 17 2026 8:56 AM

పదవి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాం

పదవి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాం

ఎమ్మెల్యే బాండ్‌పేపర్‌ రాసిచ్చి మోసం చేశారు

పరిగి 1వ వార్డు కౌన్సిలర్‌ అక్కమ్మ

పరిగి: పరిగిలో మున్సిపల్‌ పాలకవర్గం కొలువుదీరేందకు సినిమా ట్విస్ట్‌లు తలపించాయి. ఇక్కడ ఇందరు ఇండిపెండెంట్లు విజయం సాధించగా వారు ఇరు పార్టీలకు కీలకమయ్యారు. వారి మద్దతుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాట్లు పడ్డారు. పదవులు, డబ్బు ఆశచూపుతూ తమ వైపునకు తిప్పుకునేందుకు పావులు కదిపారు. 1వ వార్డు కౌన్సిలర్‌ బీఆర్‌ఎస్‌ క్యాంపులో ఉండగా 3వ వార్డు కౌన్సిలర్‌ కాంగ్రెస్‌ ఆధీనంలో ఉన్నారు. 1వ వార్డు కౌన్సిలర్‌ అక్కమ్మ కుమారుడు బాల్‌రాజ్‌ కాంగ్రెస్‌ క్యాంపులో ఉండగా స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో చర్చలు జరిపారు. తమకు వైస్‌ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇస్తేనే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానని చెప్పడంతో అందుకు ఓకే చెప్పి బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చారు. సోమవారం కౌన్సిలర్‌గా ప్రమాణస్వీకార మహోత్సవం పూర్తి అయిన తరువాత చైర్మన్‌ ఎంపికకు ఇద్దరు స్వతంత్రులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. వైస్‌ చైర్మన్‌గా 3వ వార్డు హన్మంత్‌కు ఇవ్వడంతో అక్కమ్మ అవాక్కయ్యారు. వైస్‌ చైర్‌పర్సన్‌ పదవి తనకు ఇస్తానని మోసం చేశారని తన కుమారుడిని ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. రోడ్డుపై బోరున విలపించారు. వైస్‌ చైర్మన్‌ పదవి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ అక్కమ్మ, ఆమె కుమారుడు కన్నీరుమున్నీరయ్యారు. వైస్‌ చైర్మన్‌ పదవి అక్కమ్మకే ఇవ్వాలని గ్రామస్తులు మద్దతు తెలపడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి అందరిని ఠాణా ఆవరణలో వేసి తాళం వేయడం చర్చాంశనీయంగా మారింది.

పోలీసుల లాఠీచార్జి

వైస్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇస్తామని తమను మోసం చేశారని కౌన్సిలర్‌ అక్కమ్మ భర్త నాగయ్య నాయకులనే అడుగుతా అంటూ వెళ్తుండగా పోలీసులు అడ్డకున్నారు. ప్రాధేయపడినా వినలేదు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్న ఉన్నత ఽఅధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదంటూ వారి తీరుపై పలువురు మండిపడ్డారు. మాకు మద్దతు తెలపడానికి వచ్చిన గ్రామస్తులను, కుటుంబ సభ్యులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం తగదని, ఠాణాలో వేసి తాళం వేయడం సిగ్గు చేటని కౌన్సిలర్‌ అక్కమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రమాణస్వీకార మహోత్సవాన్ని కవర్‌ చేసేందుకు వచ్చిన మీడియాపై సైతం పోలీసులు కఠినంగా వ్యవహించడం గమనర్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement