నేటి నుంచి సర్పంచులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సర్పంచులకు శిక్షణ

Feb 17 2026 8:56 AM | Updated on Feb 17 2026 8:56 AM

నేటి నుంచి సర్పంచులకు శిక్షణ

నేటి నుంచి సర్పంచులకు శిక్షణ

తాండూరు రూరల్‌: నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన తాండూరు, పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌ మండలాల్లోని 149 మంది సర్పంచ్‌లకు మంగళవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్‌ తెలిపారు. సోమవారం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కలెక్టర్‌, డీపీఓ ఆదేశాల మేరకు తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్‌లకు ఐదు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ ఉంటుందన్నారు.

నేటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ

కుల్కచర్ల: పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలుపొందిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కుల్కచర్ల ఎంపీడీఓ రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండల పరిధిలోని అల్లాపూర్‌, బొంరెడ్డిపల్లి, బోట్యానాయక్‌ తండా, చాపలగూడెం, దాస్యనాయక్‌ తండా, ఇప్పాయిపల్లి, కామునిపల్లి, కుల్కచర్ల, ముజాహిద్‌పూర్‌, పటేల్‌చెరువుతండా, పీరంపల్లి గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు ఈ నెల 17 నుంచి 21 వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. వార్డుసభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

పుచ్చకాయ పంట సాగుపై అవగాహన నేడు

కుల్కచర్ల: పుచ్చకాయ(వాటర్‌మిలాన్‌) పంట సాగుపై మంగళవారం వీడియో కాన్పరెన్స్‌ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కుల్కచర్ల మండల వ్యవసాయాధికారి వీరస్వామి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఉదయం 10గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఆసక్తిగల రైతులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రబీ పంటల నమోదు తప్పనిసరి

ఏఈఓ శ్రీనివాస్‌

మోమిన్‌పేట: రబీలో సాగు చేసిన పంటల వివరాలను రైతులు తప్పక నమోదు చేసుకోవాలని ఏఈఓ శ్రీనివాస్‌ కోరారు. సోమవారం ఆయన కేసారం క్లస్టరు రైతు వేదికలో రబీలో సాగు చేసిన పంటల వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రబీలో శనగ, కుసుమ, జొన్న, వరి, మొక్కజొన్న, ఉల్లి, బొప్పాయి, అరటి, కూరగాయ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు నమోదు చేసుకొన్న రైతుల దిగుబడులను మాత్రమే కొనుగోలు చేస్తారన్నారు. రైతులు సాగు చేసిన పంటలు నష్టపోయినప్పుడు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

సర్వేకు రైతుల సహకారం

తహసీల్దార్‌ గోవిందమ్మ

దోమ: రేడియల్‌ రింగు రోడ్డులో భాగంగా ఎంజాయ్‌ మెంట్‌ సర్వేను గ్రామాలలో కొనసాగిస్తున్నామని, ఈ సర్వేకు రైతులు సహకరిస్తున్నారని తహసీల్దార్‌ గోవిందమ్మ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పాలేపల్లి గ్రామంలో ఆర్‌ఐ వెంకటేశ్‌, సర్వేయర్‌ కిరణ్‌కుమార్‌ రైతుల భూములలో ఎంజాయ్‌మెంట్‌ సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేడియల్‌ రింగు రోడ్డుకు రైతుల నుంచి అవసరమైన భూములను మాత్రమే తీసుకుంటామన్నారు. ప్రతి రైతు వద్దకు వచ్చి తన భూమిని సర్వేయర్‌తో ఎంజాయ్‌మెంట్‌ సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నామన్నారు. ఉన్నతాధికారులు రైతులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి అవసరమైన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement