పైలెట్ అరెస్ట్ కోసం గాలింపు
తాండూరు: మున్సిపల్ ఎన్నికల కౌటింగ్ కేంద్రం వద్ద పోలీసు విధులకు ఆటంకం కల్పించారంటూ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోని వెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తన అనచరులతో కలిసి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా సీఐ సంతోశ్ అడ్డుకున్నారు. దీంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రోహిత్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం పైలెట్ రోహిత్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు నగరంలోని మణికొండ మర్రిచెట్టు ప్రాంతంలో ఉన్న ఆయన నివాసానికి రాయదుర్గం సీఐతో పాటు జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది చేరుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోవడంతో పని చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. పోలీసు అధికారులు ఇంట్లోకి వచ్చిన వీడియోలను తీస్తున్న సిబ్బంది సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చి సీసీ పుటేజీలు పరిశీలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుందామనుకుంటే ఆయన ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. మరోవైపు తాండూరులోని పైలెట్ నివాసం వద్ద , మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌లోనూ తనిఖీలు చేపట్టారు. రోహిత్‌రెడ్డి నగరం దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారా అనే అనుమానంతో శంషాబాద్‌లోని విమానాశ్రయంలో పోలీసు అధికారులు విచారించినట్లు సమాచారం.
మణికొండలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో సోదాలు


