ధర్మభిక్షంను ఆదర్శంగా తీసుకోవాలి
అబ్దుల్లాపూర్‌మెట్: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాలు కొనసాగిస్తామని సీపీఐ నేతలు పేర్కొన్నా రు. ధర్మభిక్షం జయంతి సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమానికి ధర్మబిక్షం కుమారుడు, గీతపనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మభిక్షం జీవితం నేటి సమాజానికి ఆదర్శమన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో వేల ఎకరాల భూములు పంచిన గొప్ప ఆదర్శ కమ్యూనిస్ట్ యోధుడని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్ర చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి, తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ కేవీఎల్, అబ్దుల్లాపూర్ సర్పంచ్ విజయగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బింగి దాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


