కోట్‌పల్లి ఉపాధ్యాయురాలికి డాక్టరేట్
బంట్వారం: కోట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో హిందీ టీచర్‌గా పని చేసే పాతీమాబేగంకు డాక్టరేట్ వరించింది. ఆమె సేవలను గుర్తించిన చైన్నె గ్లోబల్ వర్సీటీ రెండు రోజుల క్రితం చైన్నెలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆదివారం ఫాతిమాబేగం విలేకరులతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. డాక్టరేట్‌తో తన బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ చంద్రప్ప, ఉపాధ్యాయ బృందం ఆమెకు అభినందనలు తెలిపారు. ఆర్‌యూపీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, ప్రధానకార్యదర్శి ఎజాజ్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు.
యాలాల: తెలంగాణ గురుకుల పాఠశాలలో(వీటీజీ సెట్ 2026) ప్రవేశం కోసం రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన మోడల్ పరీక్షకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని సేవ సమితి సభ్యులు, పగిడియాల జెడ్పీహెచ్‌ఎస్ జీహెచ్‌ఎం కృష్ణయ్య అన్నారు. ఫిబ్రవరి 22న జరగనున్న ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మోడల్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గతంలో నవోదయా, పోటీపరీక్షలకు మోడల్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మోడల్ పరీక్షలో ప్రతిభ సాధించిన విద్యార్థికి స్టడీ మెటీరీయల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి తాండూరు అధ్యక్షుడు బాలకృష్ణ, సభ్యులు మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, రాము తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ పరోక్ష పద్ధతిలో సోమవారం జరగనుంది. షాద్‌నగర్ నుంచి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎక్స్‌అఫీషియోగా తన ఓటు హక్కును నమోదు చేసుకున్నట్లు కమిషనర్ సునీత తెలిపారు. మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 15 స్థానాల్లో కాంగ్రెస్, 11 చోట్ల బీఆర్‌ఎస్, 1 బీజేపీ, 1 స్వతంత్రులు గెలుపొందారు. చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ ఇప్పటికే అందుకుంది. ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియోగా నమోదు చేసుకోవడంతో ఆ పార్టీ బలం 16కు చేరింది. దీంతో సునాయసంగా చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంటుంది.
మొయినాబాద్: ‘ఊళ్లో ఇప్పటి వరకు ఇజ్జత్‌తో బతికినం.. మా తమ్ముడికి బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది.. కౌన్సిలర్‌గా గెలిచాడు.. ఇంటికొచ్చి జులూస్ చేద్దామనే లోపే నడీ రోడ్డుపై నుంచి మా తమ్మున్ని కాంగ్రెసోళ్ల ఎత్కపోయి మా ఇజ్జత్ తీస్తున్నారు. మా తమ్మున్ని మా దగ్గరకు పంపిస్తారా.. లేక మేము ఆత్మహత్య చేసుకోవాలా’ అంటూ 8వ వార్డు కౌన్సిలర్ మంచె శంకరయ్య సోదరులు మంచె పోచయ్య, మంచె సత్తయ్య, కుమారుడు మంచె నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అజీజ్‌నగర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డబ్బులు ఆశ పెట్టి ఎత్తుకెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే పంపిచాలని, లేదంటే కుటుంబ సభ్యులందరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
షాద్‌నగర్‌రూరల్: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గులో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం ప్రజా సంఘాల నాయకులు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మిస్తే షాద్‌నగర్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. పెన్షనర్స్ భవనంలో నిర్వహించే సదస్సుకు ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, నర్సింహారెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్, అర్జునప్ప, రవీంద్రనాథ్, తిరుమలయ్య, శ్రీకాంత్, ఈశ్వర్, రాంచందర్, సత్యనారాయణ, ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.


