ఎల్లమ్మా.. సల్లంగ చూడమ్మా..
● పోలేపల్లి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● భక్తిశ్రద్ధలతో చక్రస్నానం.. పల్లకీ సేవ
● నేటి సాయంత్రం సిడె వేడుక
దుద్యాల్: జగజ్జనని పోలేపల్లి రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. తొలి రోజు కోనేరు నుంచి జల్దిబిందెలలో నీరు తెచ్చి గ్రామంలోని పూర్వ ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి చక్రస్నానం నిర్వహించారు. అక్కడి నుంచి ప్రధాన ఆలయం వరకు డప్పు చప్పుళ్లు. డోలు వాయిద్యాల నడుమ పల్లకీ సేవ సాగింది. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం సిడె నేటి సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. సిడెకు తొట్టెల కట్టి.. పూలు, నిమ్మకాయలతో అందంగా అలంకరిస్తారు. లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ ఈఓ రాజేందర్ రెడ్డి, చైర్మన్ ముచ్చటి వెంకటేశ్ తెలిపారు. కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఆరుగురు ఎస్‌ఐలు, 50 మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు. జాతరను పురస్కరించుకుని శుక్రవారం మండలం వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎంఈఓ శంకర్ తెలిపారు.


