బలమైన శక్తిగా ఎదుగుతాం
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థులను గెలిపించాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎంఐఎంకు రాజకీయ చదరంగం బాగా తెలుసన్నారు. ముస్లింలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మనం కూడా బలపడి రాజకీయంగా ఎదగాలన్నారు. మజ్లిస్ పార్టీ దేశ చరిత్రలో బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. మా నాన్న నుంచి ఈ ప్రాంతం మమ్మల్ని ఆదరించిందని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంత ప్రజలను ఎన్నటికీ మరిచిపోమన్నారు. పతంగి గుర్తుకు ఓటు వేసి సత్తా చాటాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై తాను ప్రత్యేక దృష్టి పెడుతానన్నారు. ముస్లింలపై దాడులు పెరుగుతున్నా అధికార, ప్రతిపక్షం స్పందించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో బహదూర్‌పురా ఎమ్మెల్యే ముబీన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఉస్మాన్, సీనియర్ నాయకులు అలీం, బురాన్, కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకే పరిమితం కాదు..
తాండూరు: ఎంఐఎం ముస్లింలకే పరిమితమైనది కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాండూరులోని ఇద్గా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు హాది శహేరీ తదితరులు పాల్గొన్నారు.


