వేడెక్కిన ప్రచారం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిగిలో నిర్వహించిన భహిరంగ సభలో పాల్గొని జిల్లాపై వరాల జల్లు కురిపించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదులుతున్నాయి. తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ పాలనను తూర్పార పట్టారు. కాంగ్రెస్ అన్నివర్గాల ప్రజలను వంచించిందని విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు. మాజీ మంత్రి సబితారెడ్డి సైతం బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరపున వికారాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, నేతలు తిరుపతిరెడ్డి, గురునాథ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ తరఫున మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఆయా పార్టీలతో ఉన్న చీకటి ఒప్పందాలను, అనైతిక పొత్తులను ఒకరికొకరు బయటపెట్టుకుంటున్నారు. బీజేపీ సైతం మహారాష్ట్ర మంత్రులు, పార్టీ ఇన్‌చార్జిలు, ఎంపీ కొండాను రంగంలోకి దింపి అభ్యర్థుల తరపున ప్రచారం చేయిస్తోంది. ఎంఐఎం తమకు పట్టున్న వార్డులను కై వసం చేసుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఆయా పార్టీల ముఖ్య నేతల ప్రచారానికి రూ.500, భోజన వసతి కల్పిస్తూ భారీగా జనసమీకరణ చేస్తున్నారు.


