నంది సేవలో ఉద్రిక్తతత | - | Sakshi
Sakshi News home page

నంది సేవలో ఉద్రిక్తతత

Feb 17 2026 8:55 AM | Updated on Feb 17 2026 8:55 AM

నంది సేవలో ఉద్రిక్తతత

నంది సేవలో ఉద్రిక్తతత

– చప్పరం ఒరిగి కలకలం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: శ్రీకాళహస్తీశ్వర ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి నిర్వహించిన నంది సేవలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ముందస్తు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు బ్యారికేడ్లు, రోప్‌ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ, ఉత్సవమూర్తులు అలంకార మండపానికి చేరుకునేలోపే వేలాది మంది భక్తులు అక్కడికి తరలివచ్చారు. స్వామివారి ముందుకు–వెనుకకు కదలికల సమయంలో తోపులాట చోటుచేసుకుంది. రోప్‌ పార్టీ జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే నంది సేవ ముగింపు సమయంలో, సోమవారం తెల్లవారుజామున చండీకేశ్వరస్వామివారిని వాహనం నుంచి దించి గుడికి తీసుకెళుతుండగా, మోత కూలీలు, శివదీక్షలు తీసుకున్న యువకులు మోసేందుకు పోటీ పడడంతో చప్పరం ఒకవైపు ఒరిగింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే స్పందించి యువకులను పక్కకు జరిపే ప్రయత్నంలో కొంత తోపులాట జరగడంతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో భక్తులు కోపోద్రిక్తులు కావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు, చప్పరం ఒరిగిన ఘటన కావాలనే చేసినది కాదని, అత్యుత్సాహంతో జరిగిన పొరపాటేనని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో భక్తులపై లాఠీచార్జ్‌ జరిగిందన్న వీడియోలు వైరల్‌ కావడంతో తిరుపతి జిల్లా పోలీస్‌ శాఖ స్పందించింది. అపచారం జరగకుండా, భక్తుల భద్రత దృష్ట్యా చర్యలు తీసుకున్నామే గానీ లాఠీచార్జ్‌ చేయలేదని స్పష్టం చేసింది. విషయాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement