హామీలు అమలు చేయాలని వినతి
తిరుపతి మంగళం : ఏపీఐఐసీ కోసం భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పాలచ్చూరు గ్రామస్తులు కోరారు. తిరుపతి ఎంపీ కార్యాలయంలో సోమవారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పెళ్లకూరు మండలం పాలచ్చురు సమీపంలో ఉన్న తమ భూములను 2007 సంవత్సరంలో ఏపీఐఐసీకి అప్పగించామని, ఆ సమయంలో అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ తమకు 0.25 సెంట్ల ఇంటి స్థలం, ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని గ్రామస్తులు ఎంపీకి వివరించారు. అయితే ఆ హామీలు అమలు కాలేదని, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు ఎంపీకి మొరపెట్టుకున్నారు. గ్రామస్తుల సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


