గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
రాపూరు: మండలంలోని బొజ్జనపల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం ఎస్‌ఐ వెంకట్‌రాజేష్ తెలిపారు. ఇతని వయస్సు 45 –50 సంవత్సరాలు ఉంటుందని, మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదని, మృతుని వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
తండ్రి మరణాన్ని జీర్ణించు కోలేక కుమారుడి మృతి
వెంకటగిరి రూరల్: తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కుమారుడు తనువు చాలించాడు. తండ్రి మృతి చెందిన 20 రోజుల వ్యవధిలో కుమరుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. పట్టణంలోని రాణిపేటకు చెందిన మోపాటి విజయ భాస్కర్‌రెడ్డి కుమారులతో కలసి సీఎస్‌సీ సెంటర్ నిర్వహించుకుంటున్నారు. జనవరి 24వ తేదీన భాస్కర్‌రెడ్డి ఆకస్మికంగా మరణించారు. తండ్రి మరణంతో శోకంతో ఉన్న ఆయన పెద్ద కుమారుడు మోపాటి బాబు మదన్‌మోహన్‌రెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. బాబు మదన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మృతి చెందారు. 20 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో తండ్రి, కుమారుడు మృతి చెందడంతో ఆ ఇంట్లో తీరని విషాదం నిండింది.
హత్యాయత్నం కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: హత్యాయత్నం కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి రామచంద్రుడు శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాలి శ్రీనివాసులు కథనం మేరకు.. 2021 డిసెంబర్ 6 తేదీ చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, సీఆర్ కండ్రిగకు చెందిన వై.దొరస్వామి పశువుల పాక వద్ద ఉండగా వెదురుకుప్పం మండలం, సీఆర్ కండ్రిగ హరిజనవాడకు చెందిన ఎం సూర్య అలియాస్ సూర్య గోపాల్, ఎం.చిన్నబ్బ ఇతర కుటుంబ సభ్యులు వచ్చి వీధిలైట్లు విషయంపై గొడవ పడి అతనిపై మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో దొరస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అతను వెదురుకుప్పం పోలీసులకు ఇద్దరిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
దాడిలో వృద్ధుడికి గాయాలు
చంద్రగిరి: రోడ్డులో రాకపోకలకు ఇబ్బందిగా పాత సామాన్లు పెట్టడంపై ప్రశ్నించిన వృద్ధుడిపై దుకాణాదారులు దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తొండవాడ కూడలి సమీపంలో కొంత కాలంగా భార్యభర్తలు పాత సామాన్ల దుకాణం(స్క్రాప్) నిర్వహిస్తున్నారు. దుకాణానికి వచ్చే పాత సామాన్లను రోడ్డుకు అనుకుని ఉంచడంతో వాహనచోదకులకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో తొండవాడకు చెందిన నాధముని నాయుడు శుక్రవారం సాయంత్రం వారిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర కోపోద్రుక్తులైన దుకాణాదారుడి భార్య నాధముని నాయుడుపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో నాధముని నాయుడు కాలు జారీ రాయిపై పడడంతో తలకు గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని తిరుపతి రుయాకు తరలించారు. అయితే నాధముని నాయుడిపై తాము దాడి చేయలేదని, తమతో గొడవపడుతూ ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డాడని దుకాణాదారులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
ముగిసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు
తిరుపతి లీగల్: స్థానిక కోర్టు ఆవరణలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం1,288 మంది న్యాయవా దులు ఓటుహక్కు కలిగి ఉండగా1,079 మంది న్యాయవాదులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తిరుపతి న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి విద్యానాథరెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. స్థానిక కోర్టు ఆవరణలోని గ్రంథాలయముతోపాటు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో 17 బూత్‌లను ఏర్పాటు చేశారు. తిరుపతి న్యాయవాదులు నలుగురు ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో కోర్టు ఆవరణలో కోలాహాలంగా ప్రచారం జరిగింది. తిరుపతి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గజేంద్ర, ఇతర కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నారు.


