బాబు అసత్య ఆరోపణలకు హద్దుండదు
పెళ్లకూరు: చంద్రబాబు చేసే అసత్య ఆరోపణలకు హద్దుండదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కందుకూరులో జరిగిన ప్రత్యేక సమీక్ష అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లో సూపర్‌సిక్స్ పథకాలను ఒక్కటి కూడా అమలు చేయలేని నిస్సాహాయ స్థితిలో రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడానికి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై లేనిపోని రాద్దాంతం చేశాడని విమర్శించారు. అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు పుట్టుకతో కలిసొచ్చిన వరం అన్నారు. ఆయనకు తోడు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సనాతనధర్మం అంటూ వింత వింతగా ప్రవర్తించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సిట్ ఇచ్చిన నివేదికను కూడా లెక్కచేయకుండా చట్టానికి వ్యతిరేకంగా ప్లెక్సీలు కట్టడం, దానిపై స్పందించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా పార్టీ కార్యాలయాన్ని, ఆయన నివాసంపై దాడులు చేయించడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.


