హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు ఎవరూ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని పొన్నం విజ్ఞప్తి చేశారు. కేబినెట్ స్థాయిలో చర్చ జరగాలని కొంత ఆలస్యమైందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేస్తామన్నారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి పొన్నం.
దీనిలో భాగంగా రేపు(శుక్రవారం, ఏప్రిల్ 24వ తేదీ) ఆర్మీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్,. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు.
మరో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించి... సమ్మె విరమించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకునే అనాలోచిత చర్యలకు పాల్పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
క్షణికావేశంతో కొత్త సమస్యలు వస్తాయని, ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావొద్దని కోరారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెంటనే చర్చలకు ముందుకు రావాలని కార్మిక సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. కార్మికులు ఆత్మనిబ్బరంతో ఉండాలని... ప్రభుత్వంతో చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.


