సాహితీవేత్త కేకే రంగనాథాచార్యులు కన్నుమూత

Telugu Linguist KK Ranganadhacharyulu Passed Away - Sakshi

ఇటీవల కరోనా బారినపడి.. చికిత్స పొందుతూ తుదిశ్వాస

తెలుగు సాహిత్యంలో గొప్ప విమర్శకులుగా పేరు

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సాహితీ విమర్శకులు, భాషావేత్త, చరిత్రకారులు ఆచార్య కేకే రంగనాథాచార్యులు (80) కోవిడ్‌తో తార్నాకలో కన్నుమూశారు. కొద్ది రోజులక్రితం ఆయన కరోనా బారిన పడ్డారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శనివారం మృతిచెందారని బంధువులు తెలిపారు. ఆయనకు భార్య ఊర్మిళ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. తెలుగు సాహిత్యంలో గొప్ప విమర్శకులుగా పేరు పొందిన రంగనాథాచార్యులు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషాసాహిత్యాలు బోధించారు.

తెలుగు, సంస్కృత భాషల్లో పలు పరిశోధనలు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలకు ప్రిన్సిపాల్‌గానూ పనిచేశారు. సాహిత్య విమర్శకులు మాత్రమే కాకుండా సాహిత్య చరిత్ర రచనకు, సాహిత్య ఉద్యమాలకు కృషి చేశారు. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌ల సన్నిహిత మిత్రుడిగా దిగంబర కవుల సంచలనానికి ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. విప్లవ రచయితల సంఘం ఏర్పాటుకు కృషి చేశారు. 1970 జూలై 4వ తేదీన విరసం ఆవిర్భావ ప్రకటనపైన సంతకం చేసిన పద్నాలుగు మందిలో ‘రంగనాథం’అనే సంతకం ఆయనదే. రంగనాథాచార్యులు అనేక గ్రంథాలను రాశారు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, తెలుగులో తొలి సమాజ కవులు, తెలుగు సాహిత్య వికాసం, నూరేళ్ల తెలుగునాడు, రాచకొండ విశ్వనాథశాస్త్రి, తెలుగు సాహిత్యం మరో చూపు, తెలుగు సాహిత్యం వచన రచనా పరిచయం ఆయన కలంనుంచి వెలువడినవే. ఆయన మృతి పట్ల తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ రచయిత కోడం కుమార్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. 

సీఎం కేసీఆర్‌ సంతాపం 
భాషా సాహితీవేత్త, విమర్శకులు ఆచార్య కేకే రంగనాథాచార్యుల మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య వికాసానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

తెలుగు సాహిత్య వికాసానికి ఎనలేని సేవలు
తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఆచార్య రంగనాథాచార్యులు మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పండితులుగా పలు ఉన్నత పదవులను నిర్వహించిన ఆచార్యులు, తెలుగు సాహిత్య వికాసానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. వారి కుటుంబానికి హరీశ్‌రావు, గోరటి వెంకన్న ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  

57 ఏళ్ల స్నేహబంధం తెగిపోయింది
రంగనాథాచార్యులు మరణంతో తమ 57 ఏళ్ల ఆత్మీ య స్నేహబంధం తెగిపోయిందని ప్రముఖ సాహితీవేత్త నిఖిలేశ్వర్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేశారు. సంస్కృతం, తెలుగు, హిందీ భాషాశాస్త్రాల్లో ఆయ న విద్వత్తు సాధించారని, దిగంబరకవులుగా ఆయ న తాత్విక సాహిత్యయాత్ర కొనసాగిందని తెలి పారు. విప్లవ, సాహిత్య, సామాజిక ఉద్యమాల్లో దశాబ్దాల పాటు వెంట నడిచిన సన్నిహిత మిత్రులు జ్వాలాముఖి మరణం తర్వాత తమకు ఇదే పెద్ద విషాదమని నిఖిలేశ్వర్‌ ఆవేదన వెలిబుచ్చారు.
చదవండి: బ్లాక్‌ ఫంగస్‌తో అప్రమత్తం!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top