Shoyabullakhan: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్‌

Telangana Vimochana Dinotsavam 2022: Shoyabullakhan Life Story - Sakshi

నిజాం ప్రభుత్వాన్ని వణికించిన నిర్భయ జర్నలిస్ట్‌

లక్ష్య సాధనలో నడి రోడ్డుపై తుదిశ్వాస వదిలిన త్యాగధనుడు 

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్‌ సంస్థానంలోని తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత స్వాతంత్య్రం సిద్ధించింది. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి ఎందరో దేశభక్తులు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. నిజాం నిరంకుశత్వానికి.. రజాకార్ల ఆరాచకాలను ప్రపంచానికి తెలిసేలా వార్తలు, సంపాదకీయాలు రాసిన షోయబ్‌–ఉల్లా–ఖాన్‌ గురించి మనం తెలుసుకోవాలి. హైదరాబాద్‌ సంస్థానం పరిధిలోని ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలని తన కలాన్ని గళంగా మార్చుకుని నిజాం వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతూ అసువులు బాసిన షోయబుల్లాఖాన్‌కు సలాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నేటి యువత, విద్యార్థులు ఆయన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ కథనం. 


పోచారం:
ప్రజాస్వామ్య విలువల కోసం అక్షర పోరాటం చేస్తూ.. నడి రోడ్డుపై ప్రాణ త్యాగం చేసిన షోయబుల్లాఖాన్‌ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం. 1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని షోయబ్‌ ఆకాంక్షించారు. ఆ తరుణంలోనే హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని నిజాం రాజుకు ఏడుగురు ముస్లిం పెద్దలు విజ్ఞాపన పత్రం సమర్పించారు. దీనిని షోయబ్‌ తన సొంత పత్రిక ఇమ్రోజ్‌లో ప్రచురించారు. పత్రికలో వచ్చిన కథనాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత్‌ ప్రస్తావిస్తుందేమోనని నిజాం భయపడి షోయబ్‌ను హత్య చేయించాడు. 


కుటుంబ నేపథ్యం.. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరి కుటుంబం నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. ఖమ్మం జిల్లా సుబ్రవేడ్‌లో 1920 అక్టోబర్‌ 17న హబీబుల్లాఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లాఖాన్‌ జన్మించారు. 

తేజ్, రయ్యత్‌ పత్రికల్లో జర్నలిస్టుగా.. 
ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. తేజ్‌ అనే ఉర్దూ పత్రికలో చేరి రజాకార్ల అరాచకాలపై అక్షర నిప్పులు చెరిగేవారు. దీంతో తేజ్‌ పత్రికను సర్కార్‌ నిషేధించడంతో రయ్యత్‌ పత్రికలో చేరారు. చివరకు రయ్యత్‌ పత్రికను ప్రభుత్వం మూసివేయించింది. 

బూర్గుల సాయంతో ఇమ్రోజ్‌ పత్రిక స్థాపన 
నగలు నట్రా అమ్మి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో హైదరాబాద్‌లోని కాచిగూడలో ఇమ్రోజ్‌ అనే పత్రికను షోయబ్‌ స్థాపించారు. 

షోయబ్‌ రచనలకు రగిలిపోయిన ఖాసిం రజ్వీ 
1947 నవంబర్‌ 17న తొలి సంచిక వెలువడింది. నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ పదునైన సంపాదకీయాలు రచించేవారు. వీరి రచనలకు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ రగిలిపోయాడు. (క్లిక్: చరిత్రను కాటేయ జూస్తున్నారు!)

చప్పల్‌బజార్‌ రోడ్డులో చంపిన రజాకార్లు 
► 1948 ఆసుస్టు 21న కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ఇమ్రోజ్‌ ఆఫీస్‌ నుంచి అర్ధరాత్రి తన బావమరిది ఇస్మాయిల్‌ఖాన్‌తో కలిసి ఇంటికి వస్తుండగా చప్పల్‌బజార్‌ రోడ్డులో రజాకార్లు అతిక్రూరంగా చేతిని నరికి తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు.  

► అడ్డుకోబోయిన తన బావమరిది చేతులు సైతం నరికేశారు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ 1948 ఆగస్టు 22వ తేదీన తెల్లవారు జామున షోయబ్‌ తుదిశ్వాస విడిచారు. 

► ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో నివసిస్తున్నారు. మలక్‌పేట్‌లో షోయబ్‌ పేరుతో ఒక గదిలో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు ఏర్పాటు చేశారు.

(క్లిక్: సెప్టెంబర్‌ 17.. ప్రాధాన్యత ఏమిటి?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top