
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడానికి ముందే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీటముడి వేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి సంబంధించి హైకోర్టులో ఉన్న కేసు పరిష్కారమయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించినట్లు బుధవారం రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్‌కుమార్, కె.సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రతిపాదిస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన సిఫారసులను సెప్టెంబర్ 19న తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీచేశారు.
గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అభ్యర్థులిద్దరూ వేసిన కేసు ఇటీవల రాష్ట్ర హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. తొలుత కేసు విచారణార్హతను తేల్చాలని నిర్ణయిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు పరిష్కారమయ్యే వరకు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మరొకరి పేరును ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.