సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ, ట్రాయ్ అధికారుల పేరిట ఫోన్ కాల్స్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు హెచ్చరించారు. +97,+85 తో మొదలయ్యే నంబర్లతో వచ్చే ఫోన్‌కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ రెండు నంబర్ల కోడ్‌తో మొదలయ్యే ఫోన్ నంబర్లు మోసపూరితమైనవి గ్రహించాలని, ఆ నంబర్ల నుంచి వస్తే ఫోన్ ఎత్తవద్దని పేర్కొన్నారు. ఒకవేళ ఈ తరహా ఫోన్‌కాల్స్‌వల్ల మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
కాగా, అవాంఛిత, మోసపూరిత కాల్స్, సందేశాలు సవాల్‌గా మారాయి. వ్యక్తుల భద్రతకు ముప్పుగా పరిణమించడంతోపాటు ఆర్థిక నష్టాలకూ ఇవి కారణం అవుతున్నాయి. మన దేశంలో 95 శాతం మంది మొబైల్ యూజర్లకు ప్రతిరోజూ స్పామ్ కాల్స్, సందేశాలు వెల్లువెత్తుతున్నాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2024 సెప్టెంబర్ నుంచి 2026 జనవరి మధ్య 7,100 కోట్ల స్పామ్ కాల్స్, 290 కోట్ల స్పామ్ సందేశాలను గుర్తించినట్లు ఎయిర్‌టెల్ ఇటీవల ప్రకటించింది.
8 లక్షలకుపైగా మోసపూరిత లింక్స్‌ను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కాల్ సెంటర్లతో వ్యవస్థీకృతంగా మోసపూరిత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపింది. సైబర్ నేరగాళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 92.7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ వెల్లడించారు. 250కిపైగా కొలమానాలను పరిగణనలోకి తీసుకొని స్పామ్ కాల్స్, సందేశాలను గుర్తిస్తున్నట్టు చెప్పారు.


