
చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ భామల సందడి
పాతబస్తీలో మిస్ వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్
అరబ్బీ మార్ఫా సంగీతానికి స్టెప్పులేసిన అందగత్తెలు
చార్మినార్‌ను ఆసక్తిగా తిలకించిన సుందరీమణులు
లాడ్‌బజార్‌లో షాపింగ్..
చౌమొహల్లా ప్యాలెస్‌లో విందు.. పాల్గొన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: నిజాం వారసత్వ వైభవానికి, ఇప్పటికీ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద వివిధ దేశాల సుందరీమణులు సందడి చేశారు. చార్మినార్‌ను ఆసక్తిగా తిలకించారు. ఫొటోలకు పోజులిచ్చారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ హెరిటేజ్ వాక్ ఉత్సాహంగా సాగింది.
చార్మినార్ వద్ద, లాడ్‌బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై అందాల భామలు వయ్యారంగా నడుస్తూ స్థానికులను అలరించారు. వీరికి పాతబస్తీలో పాపులర్ అయిన అరబ్బీ మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలకగా..కొందరు మార్ఫా వాయిద్యాల సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. అనంతరం లాడ్ బజార్‌కు వెళ్లారు. చుడీ బజార్ (గాజుల మార్కెట్)లో షాపింగ్ చేశారు.
సెల్ ఫోన్లలో చార్మినార్..గ్రూప్ ఫొటో
ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరానికి చేరుకున్న దాదాపు 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మంగళవారం ప్రభుత్వం హెరిటేజ్ వాక్‌లో భాగంగా వారు చార్మినార్‌ను సందర్శించారు. విశిష్టమైన నగర వారసత్వ వైభవానికి ఈ అందాల ముద్దుగుమ్మలు ఫిదా అయిపోయారు. చార్మినార్‌ను తిలకించడమే కాకుండా దాని ముందు ఏర్పాటు చేసిన వేదికపై గ్రూప్ ఫోటో దిగారు. చార్మినార్ చరిత్ర, గొప్పదనం గురించి టూరిజం శాఖ గైడ్‌లను అడిగి తెలుసుకున్నారు. కొందరు తమ ఫోన్‌లలో చార్మినార్ అందాలను బంధించారు.
గాజులు, ముత్యాల హారాల షాపింగ్
నగర జీవనశైలి, ఇక్కడి విభిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రపంచ సుందరీమణులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో చార్మినార్ సమీపంలోని లాడ్ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో హెరిటేజ్ వాక్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతీలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కేఆర్ కాసత్, జాజు పెరల్స్, ఏ హెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో ఈ మిస్ వరల్డ్ తారలు అందమైన గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులు తీసుకున్నారు.
నగర విశిష్టతను చాటాలన్న వ్యాపారులు
లాడ్ బజార్ వ్యాపారులు కొందరు సుందరీమణుల వద్ద డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. మీమీ దేశాల్లో హైదరాబాద్ విశిష్టతను, చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లాడ్ బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిక్షాలు, రంగురంగుల అలంకరణలు ఆకట్టుకున్నాయి. సుందరీమణుల హెరిటేజ్ వాక్ సందర్భంగా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది.