heritage walk
-
వయ్యారి భామ.. నీ హంస నడక!
సాక్షి, హైదరాబాద్: నిజాం వారసత్వ వైభవానికి, ఇప్పటికీ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద వివిధ దేశాల సుందరీమణులు సందడి చేశారు. చార్మినార్‌ను ఆసక్తిగా తిలకించారు. ఫొటోలకు పోజులిచ్చారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ హెరిటేజ్ వాక్ ఉత్సాహంగా సాగింది. చార్మినార్ వద్ద, లాడ్‌బజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై అందాల భామలు వయ్యారంగా నడుస్తూ స్థానికులను అలరించారు. వీరికి పాతబస్తీలో పాపులర్ అయిన అరబ్బీ మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలకగా..కొందరు మార్ఫా వాయిద్యాల సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. అనంతరం లాడ్ బజార్‌కు వెళ్లారు. చుడీ బజార్ (గాజుల మార్కెట్)లో షాపింగ్ చేశారు.సెల్ ఫోన్లలో చార్మినార్..గ్రూప్ ఫొటోప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరానికి చేరుకున్న దాదాపు 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మంగళవారం ప్రభుత్వం హెరిటేజ్ వాక్‌లో భాగంగా వారు చార్మినార్‌ను సందర్శించారు. విశిష్టమైన నగర వారసత్వ వైభవానికి ఈ అందాల ముద్దుగుమ్మలు ఫిదా అయిపోయారు. చార్మినార్‌ను తిలకించడమే కాకుండా దాని ముందు ఏర్పాటు చేసిన వేదికపై గ్రూప్ ఫోటో దిగారు. చార్మినార్ చరిత్ర, గొప్పదనం గురించి టూరిజం శాఖ గైడ్లను అడిగి తెలుసుకున్నారు. కొందరు తమ ఫోన్లలో చార్మినార్ అందాలను బంధించారు. గాజులు, ముత్యాల హారాల షాపింగ్నగర జీవనశైలి, ఇక్కడి విభిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రపంచ సుందరీమణులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో చార్మినార్ సమీపంలోని లాడ్ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో హెరిటేజ్ వాక్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతీలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కేఆర్ కాసత్, జాజు పెరల్స్, ఏ హెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో ఈ మిస్ వరల్డ్ తారలు అందమైన గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులు తీసుకున్నారు. నగర విశిష్టతను చాటాలన్న వ్యాపారులులాడ్ బజార్ వ్యాపారులు కొందరు సుందరీమణుల వద్ద డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. మీమీ దేశాల్లో హైదరాబాద్ విశిష్టతను, చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లాడ్ బజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిక్షాలు, రంగురంగుల అలంకరణలు ఆకట్టుకున్నాయి. సుందరీమణుల హెరిటేజ్ వాక్ సందర్భంగా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. -
ఓల్డ్ సిటీ.. న్యూ బ్యూటీ
హైదరాబాద్: మిస్ వరల్డ్–2025 పోటీదారులతో చార్మినార్నుంచి లాడ్ బజార్ వరకు మంగళవారం నిర్వహించనున్న హెరిటేజ్ వాక్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు పాతబస్తీలో కొన్ని ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే చిరు వ్యాపారులను కట్టడి చేసే దిశగా అందరికీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఒకరోజు తమ వ్యాపారాలకు సెలవు ఇవ్వాలని సూచించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. చార్మినార్‌కు నాలుగు వైపులా ఉన్న దారుల్లో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అణువణువూ తనిఖీ చేసిన అనంతరమే చార్మినార్ (Charminar) వరకు అనుమతించనున్నారు. ఇప్పటికే బాంబు, డాగ్ స్క్వాడ్లతో చార్మినార్, లాడ్ బజార్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ రూట్లో రహదారులను అందంగా తీర్చిదిద్ది..ఇరువైపులా తాత్కాలిక విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. చార్మినార్నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ అనంతరం అందాల పోటీదారులు ఇక్కడ షాపింగ్ చేయనున్నారు. అంతరం అక్కడి నుంచి వాహనాల ద్వారా చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకొని డిన్నర్ చేయనున్నారు. ఈ డిన్నర్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొననున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్‌లో పాల్గొననున్నారు. చార్మినా ర్నుంచి లాడ్ బజార్ వరకు నిర్వహించే వాక్‌లో ప్రపంచ సుందరాంగులు పాల్గొని ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటారు. అనంతరం షాపింగ్ చేయనున్నారు. తెలంగాణ జరూర్ ఆనా.. అనే టైటిల్‌తో చూడముచ్చటగా తయారు చేయించిన ప్రత్యేక ఏసీ బస్సులో మిస్ వరల్డ్ పోటీదారులు పాతబస్తీకి వస్తారు. శివారు ప్రాంతమైన ఆరాంఘర్ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లై ఓవర్ ద్వారా పాతబస్తీలోకి ప్రవేశిస్తారు. అనంతరం బహదూర్‌పురా, పురానాపూల్, పేట్లబురుజు, మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ మీదుగా చారి్మనార్‌కు చేరుకుంటారు. డిన్నర్ (Dinner) అనంతరం తిరిగివచ్చిన రూట్లోనే వెళ్లనున్నారు. హెరిటేజ్ వాక్ (Heritage Walk) కోసం పాతబస్తీలో దాదాపు 10 కిలో మీటర్ల రేడియస్‌లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని జీహెచ్ఎంసీ (GHMC) చార్మినార్ జోనల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. వీధి దీపాల ఏర్పాటుతో పాటు తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ, బీటీ రోడ్లు, డివైడర్ల మరమ్మతులు చేయించామన్నారు. దాదాపు 250 మంది కారి్మకులు పారిశుధ్య పనుల్లో పాలుపంచుకున్నారని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. మదీనా నుండి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ, శాలిబండ (రాజేష్ మెడికల్ హాల్) నుండి వోల్గా జంక్షన్, వోల్గా జంక్షన్ నుండి మూసబౌలి వయా ఖిల్వత్ రోడ్డుకు వెళ్లే రోడ్లలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకల్ని నియంత్రించనున్నారు. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు నగర పోలీస్ (ట్రాఫిక్) జాయింట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మదీనా జంక్షన్: నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు. హిమ్మత్‌పుర: నాగల్‌చింత/శాలిబండ ప్రాంతాల నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమ్మత్‌పురా జంక్షన్, హరి బౌలి మరియు వోల్గా జంక్షన్ వైపు ఫతే దర్వాజా రోడ్డు వరకు తరలిస్తారు.వోల్గా జంక్షన్: హిమ్మత్‌పురా నుండి వచ్చే ట్రాఫిక్‌ను చౌమొహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు. వీటిని వోల్గా జంక్షన్ ఫతే దర్వాజా వైపు మళ్లిస్తారు. ఫతే దర్వాజా నుండి వచ్చే ట్రాఫిక్‌ను హిమ్మిత్పురా వైపు మళ్లిస్తారు. మూసబౌలి: పురానాపూల్ (గుడ్ విల్ కేఫ్) నుండి వచ్చే ట్రాఫిక్‌ను చారి్మనార్/చౌమహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు మరియు మూసబౌలి వద్ద సిటీ కాలేజ్ మరియు ఫతే దర్వాజా వైపు దూద్‌బౌలి ద్వారా మళ్లిస్తారు. చౌక్ మైదాన్ కమాన్: చౌక్ మైదాన్ నుండి చార్మినార్వైపు వచ్చే ట్రాఫిక్‌ను చౌక్ మైదాన్ వద్ద కోట్ల అలిజా లేదా మొఘల్‌పురా వైపు మళ్లిస్తారు. ఎతేబార్ చౌక్: ఎతేబార్ చౌక్ ప్రాంతం నుండి గుల్జార్‌హౌస్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎతేబార్ చౌక్ వద్ద మండి మిరాలం మార్కెట్ లేదా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. షేర్ ఎ బైతుల్ కమాన్: మిట్టి కా షేర్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను గుల్జార్ హౌస్ వైపు అనుమతించరు మరియు మిట్టి–కే–షేర్ జంక్షన్ వద్ద ఘాన్సీ బజార్ వైపు మళ్లించి హైకోర్టు రోడ్డుకు చేరుకుంటారు. లక్కడ్ కోట్ (పాత సీపీ ఆఫీస్ జంక్షన్): అపాట్ వైపు నుండి చార్మినార్వైపు వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్ కోట్ వద్ద (ఓల్డ్ సీపీ ఆఫీస్ లేన్) మరియు మిరాలం మండి మార్కెట్ వైపు మళ్లిస్తారు (అవసరమైతే) ఈ పరిమితులు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి. -
Miss World 2025: హెరిటేజ్ వాక్కు సర్వం సిద్ధం..
చార్మినార్: పాతబస్తీలో మిస్ వరల్డ్ సుందరాంగులు సందడి చేయనున్నారు. నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్–2025లో పాల్గొంటున్న పోటీదారులతో ఈ నెల 13న చారి్మనార్‌లో హెరిటేజ్ వాక్ జరగనుంది. దాదాపు 120 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు ఈ హెరిటేజ్ వాక్‌లో పాల్గోనున్నారు. చారి్మనార్ నుంచి లాడ్ బజార్ వరకూ నిర్వహించే వాక్‌లో కంటెస్టెంట్స్ ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోనున్నారు. పాతబస్తీ చారిత్రక కట్టడాల విశేషాలతో పాటు లాడ్ బజార్‌లోని గాజుల తయారీ కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. హెరిటేజ్ వాక్ సందర్భంగా పాతబస్తీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే చారి్మనార్ కట్టడాన్ని మువ్వన్నెల జెండా రంగుల్లో విద్యుత్ దీపాలంకరణ చేశారు. పర్యాటకులు చారి్మనార్ వద్ద సెల్పీలు దిగుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, డివైడర్లకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అఫ్జల్‌గంజ్ ద్వారా పాతబస్తీకి ప్రవేశించే నయాపూల్ బ్రిడ్జిపై కొత్తగా మొక్కలతో అలంకరించారు. రిహార్సల్స్ పూర్తి.. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో దక్షిణ మండలం డీసీపీ స్నేహా మెహ్రా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చార్మినార్ నుంచి లాడ్‌బజార్ వరకూ హెరిటేజ్ వాక్ రిహార్సల్స్ జరిగాయి. పోలీసు, పర్యాటక, విద్యుత్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఆర్కియాలజీ, జలమండలి.. ఇలా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. తెలంగాణ జరూర్ ఆనా..అనే టైటిల్‌తో రూపొందించిన ఏసీ బస్సులో మిస్ వరల్డ్–2025 అభ్యర్థులను తరలించనున్నారు. శివారు ప్రాంతమైన ఆరంఘర్ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ద్వారా పాతబస్తీకి ప్రవేశించి బహదూర్‌పురా, పురానాపూల్, పేట్లబురుజు, మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ ద్వారా చారి్మనార్‌కు చేరుకోనుంది. -
“చరిత్రలోకి అడుగేసి మన నగర గత వైభవాన్ని గుర్తిద్దాం”
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న నిర్వహించే ప్రపంచ వారసత్వ దినోత్సవం (International Day for Monuments and Sites) సందర్భంగా, ఈరోజు ఉదయం 7:30 గంటలకు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో, పురావస్తు శాఖ (ASI) – హైదరాబాద్ సర్కిల్, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TSTDC), JBRAC, ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్, ఇతర పౌర సంఘాల భాగస్వామ్యంతో ఘనంగా హెరిటేజ్ వాక్ నిర్వహించబడింది.Er. వేదకుమార్ మనికొండ, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఛైర్మన్ ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద ప్రారంభించి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.ప్రొఫెసర్ Ar. జి.ఎస్.వి. సూర్యనారాయణ మూర్తి(South Zone Representative, ICOMOS, India), డా. జి. జయశ్రీ, ప్రాచీన భారత చరిత్ర మరియు పురావస్తు శాఖ, ఉస్మానియా యూనివర్సిటీ, కోటయ్య వింజమూరి, డిప్యూటీ సూపరింటెండెంట్ కెమిస్ట్, ASI, డా. ఈ. సాయికృష్ణ, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్, ASI, శ్రీమతి జె. రాజేశ్వరి (Conservationist, ASI), సాయి రామ్, సుధాకర్, కార్యనిర్వాహకులు(తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్) , ఎస్. ప్రభాకర్(DTO, పర్యాటక శాఖ), డి. శ్రీనివాస్ (హెరిటేజ్ వాక్ ఇన్చార్జ్), డి. శ్యాం సుందర్ రావు, స్థపతి, డా. ద్యావనపల్లి సత్యనారాయణ(క్యురేటర్, తెలంగాణ గిరిజన మ్యూజియం), పి. వీరమల్లు, అధ్యక్షుడు, బౌద్ధ తత్వ ఫౌండేషన్ మరియు సిటీ కాలేజ్, JBRAC, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, SRDP, వాసవి స్కూల్, వైష్ణవి ఆర్కిటెక్చర్ కాలేజ్ విద్యార్థులు, పౌర సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.Er.వేదకుమార్ మనికొండ గారు చార్మినార్ నుండి చౌమహల్లా ప్యాలెస్ వరకు ఉన్న ముఖ్యమైన వారసత్వ కట్టడాల చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తూ, వారసత్వ సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది మన సమాజపు కలసికట్టు బాధ్యతగా భావించాలని సూచించారు. హైదరాబాద్ యొక్క చారిత్రక ఘనతను ప్రజలకు తెలియపరుస్తూ, వారసత్వ పరిరక్షణ మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు.ఇంకా, తెలంగాణ వారసత్వ శాఖ మరియు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సంయుక్తంగా ముదుమల్ మెగలిథిక్ మెన్హిర్స్ సైట్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాథమిక జాబితాలో చేర్చించడంలో చేసిన ప్రయత్నాలను వివరించారు. త్వరలో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూర్యనారాయణ మూర్తి గారు మాట్లాడుతూ, ఇటువంటి వాక్‌ల ప్రాముఖ్యతను వివరించారు. చార్మినార్ యొక్క చారిత్రక, శిల్పకళా విశేషాలను విద్యార్థులకు వివరించారు.చార్మినార్ మీదుగా లాడ్ బజార్, మోతిగల్లి,మెహబూబ్ చౌక్ (ముర్గీ చౌక్), ఇక్బాల్ ఉద్ దౌలా దేవ్డీ, మక్కా మసీదు ద్వితీయ ద్వారం, జిలుఖానా,ఖుర్షీద్ జా బహదూర్ ప్యాలెస్,ఇక్బాల్ ఉద్ దౌలా ప్యాలెస్, ఖిలావత్, చౌమహల్లా ప్యాలెస్ వద్ద ఈ వాక్ ముగిసింది.ఈ వాక్ ద్వారా పాల్గొన్నవారికి హైదరాబాద్ నగరపు ప్రాచీన వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలిగారు. రాజప్రాసాదాలు, శతాబ్దాల నాటి మసీదులు, స్థానిక శిల్పకళ ఆధారిత నిర్మాణాలు వారి చూపుల ముందే ఆవిష్కృతమయ్యాయి. నగరపు బహుముఖ సంస్కృతి మరియు వారసత్వంపై గర్వభావం వారిలో మళ్ళీ వెల్లివిరిసింది. -
వారసత్వ సంపదను పరిరక్షించుకుందాం
- జిల్లా పర్యాటక అధికారి పిలుపు - కలెక్టరేట్ నుంచి గోల్ గుమ్మజ్ వరకు హెరిటేజ్ వాక్ కర్నూలు(అగ్రికల్చర్): వారసత్వ సంపద పరిరక్షణకు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా పర్యాటక అధికారి, ఇంటాక్ కర్నూలు చాప్టర్ కార్యదర్శి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురష్కరించుకొని మంగళవారం హెరిటేజ్ వాక్ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా పర్యాటక అధికారి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు , ఇంటాక్ జిల్లా చాప్టర్ సంయుక్తంగా సాంస్కృతిక వారసత్వం, సుస్థిర పర్యాటకం కింద మంగళవారం హెరిటేజ్ వాక్ నిర్వహించాయి. కలెక్టరేట్ నుంచి ఆర్కియాలజీ మ్యూజియం, తెలుగు బాప్టిస్ట్ చర్చి, కోల్స్ కాలేజి, కొండారెడ్డిబురుజు మీదుగా గోల్ గమ్మజ్ వరకు హెరిటేజ్ వాక్ సాగింది. ఈ సందర్భంగా వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. చారిత్రక కట్టడాలు, కళాఖండాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. గత చరిత్రపై భావి తరాల వారికి అవగాహన ఏర్పాడాలంటే వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రతినిధులు కె. మద్దయ్య, రాధశ్రీ, మహేంద్రనాయుడు, కృష్ణచైతన్య, చెన్నయ్య, భాస్కర్, విజయకుమార్, ఆదిశేషులు, ప్రకాశ్ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు హెరిటేజ్ వాక్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కర్నూలు నగరంలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి బి.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక శాఖ ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు, ఇంటాక్ జిల్లా చాప్టర్ సంయుక్తంగా సాంస్కృతిక వారసత్వం, సుస్థిర పర్యాటకం కింద హెరిటేజ్ వాక్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి ఆర్కియాలజీ మ్యూజియం, తెలుగు బాపిస్ట్ చర్చి, కోల్స్ కాలేజ్, కొండారెడ్డిబురుజు మీదుగా గోల్ గమ్మజ్ వరకు సాగే హెరిటేజ్ వాక్‌లో పాఠశాలలు, కళాశాలలు, చరిత్ర అధ్యాపకులు, యువత పాల్గొనాలన్నారు. -
హెరిటేజ్ వాక్కు విశేష స్పందన
యాకుత్‌ఫురా: తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పాతబస్తీలో వారసత్వ కట్టడాల విశిష్టతపై నిర్వహించిన హెరిటేజ్ వాక్ కు పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించింది. చార్మినార్ నుంచి ప్రారంభమైన ఈ వాక్ గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, మీరాలంమండి, పత్తర్‌గట్టి, దివాన్‌దేవిడి, మదీనా బాద్షా ఆషూర్ఖానా వరకు కొనసాగింది. ఈ వాక్‌లో పాల్గొన్న పర్యాటకులకు సీనియర్ గైడ్ సూర్యకాంత్ సామ్రాణి కట్టడాల విశిష్టతను వివరించారు.