
ముగ్గురు గ్రేహౌండ్స్ కమాండోల మృతి
ఆర్‌ఎస్‌ఐకి గాయాలు..హైదరాబాద్‌కు తరలింపు
ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
మాటు వేసి మందుపాతర్లు పేల్చారు: డీజీపీ
వాజేడు/ఎంజీఎం/సాక్షి, హైదరాబాద్: కర్రిగుట్టలు మరోసారి దద్దరిల్లాయి. ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల పైనున్న పెనుగోలు గ్రామ సమీప నూగూరు అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను మావోయిస్టులు పేల్చేశారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండోలు వడ్ల శ్రీధర్ (జేసీ4973/పీసీ1785), ఎన్.పవన్‌కల్యాణ్ (జేసీ10541/పీసీ) టి.సందీప్ (జేసీ 4638/పీసీ8124) అక్కడికక్కడే మృతి చెందారు.
పైడిపల్లికి చెందిన అర్‌ఎస్‌ఐ సీహెచ్ రణదీర్ గాయపడ్డారు. మరో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. కాగా మెరుగైన వైద్యం కోసం రణదీర్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు.
భారీ ఎన్‌కౌంటర్ మరుసటి రోజే..
కర్రిగుట్టల్లో చేపట్టిన కగార్ ఆపరేషన్ 17 రోజులకు చేరుకుంది. కర్రి గుట్టలను చుట్టు ముట్టిన భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బుధవారం ఎన్‌కౌంటర్ చోటు చేసుకోగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ కోసం వచ్చే దళాలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని ముందే అమర్చిన మందుపాతరలను రిమోట్ల సహాయంతో పేల్చివేసినట్లు తెలుస్తోంది. 35 – 40 మందితో కూడిన మావోయిస్టుల బృందం (మహిళలు కూడా ఉన్నారు) ఇందులో పాల్గొన్నట్టు సమాచారం.
మృతదేహాలు పరిశీలించిన మంత్రి, డీజీపీ
గ్రేహౌండ్స్ కమాండర్ల మృతదేహాలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, గ్రే హౌండ్స్ ఏడీజీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, ము లుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ మార్చురీ వద్ద పరిశీలించారు.
ఈ ఘటనపై వాజేడు పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 62, 148, 191(1), 191(3), 103, 109 ఆర్/డబ్ల్యూ 190 బీఎన్‌ఎస్, సెక్షన్ 25(1–బీ)(ఏ), 27 ఏఆర్‌ఎమ్‌ఎస్ యాక్ట్, సెక్షన్ 10, 13 ,18,20, కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కాగా మందుపాతర్ల పేలుడులో మరణించిన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ (30)కు 9 నెలల క్రితమే వివాహమైనట్లు తెలిసింది.
నాలుగు గంటల పాటు పోస్టుమార్టం
మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరుకున్న పోలీసుల మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులు నాలుగు గంటల పాటు పోస్టుమార్టం జరిపారు. బుల్లెట్ల గాయాలతోనే జవాన్లు మృతి చెందినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు: డీజీపీ
ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఈడీల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులపై దూరంలో మాటేసిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చారని డీజీపీ తెలిపారు. సెర్చ్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా భారీ కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు కాల్పులు ఆపేసి పారిపోయారన్నారు.
ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దు: మావోయిస్టులు
పోలీసుల వలలోపడి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని మావోయిస్టులు మరోమారు హెచ్చరించారు. ఈ మేరకు మావోయిస్టు వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట గురువారం ఒక లేఖ విడుదల అయ్యింది. ‘పోలీసు బలగాల కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి కర్రిగుట్టలపై బాంబులు అమర్చాం. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాం.
అయినా కొంతమంది ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలకు పోలీసులు మాయ మాటలు చెప్పి నమ్మిస్తూ, డబ్బులు ఇస్తూ ఇన్‌ఫార్మర్లుగా మార్చుకుంటున్నారు. షికారు పేరుతో వారిని కర్రిగుట్టల వైపు పంపిస్తున్నారు. మా రక్షణ కోసం అమర్చిన బాంబులు పేలి వారు చనిపోతున్నారు. కాబట్టి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం..’అని ఆ లేఖలో పేర్కొన్నారు.