తగ్గేదేలే.. అంతా మా ఇష్టం..

Hyderabad: Old City People Not Follow Traffic Rules - Sakshi

సాక్షి,చార్మినార్‌(హైదరాబాద్‌): పాతబస్తీలో వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రాకపోకలు సాగిస్తున్నారు. పాతబస్తీలోని దక్షిణ మండలంలో చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, బహదూర్‌పురా నాలుగు ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో రెండు, మూడు జాతీయ రహదారులతో పాటు ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లలో ప్రతిరోజు వాహనాల రాకపోకలు జోరుగా కొనసాగుతాయి. అయితే కొంత మంది వాహనదారులు నిబంధనలు డోంట్‌ కేర్‌ అంటూ.. వాహనాలను ఇష్టానుసారంగా నడుపుతూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఉన్నా.. వారు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.

 ► ప్రధాన కూడళ్లలో ఆశించిన మేరకు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అందుబాటులో లేకపోవడం, సిగ్నల్స్‌ లేని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు విధి నిర్వహణలో ఉండాల్సినప్పటికీ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. 
► అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రోడ్లలో సైతం యువతీ, యువకులు రయ్‌.. మంటూ దూసుకెళ్తూ ఇతర వాహనదారులకు ఆటంకాలు కలిగిస్తున్నారు.  

నంబర్‌ ప్లేట్ల మార్పులు..  
► పాతబస్తీలో కొందరు వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనాల నంబర్‌ ప్లేట్లను మార్చేస్తున్నారు.  
► కొందరైతే ఉద్దేశపూర్వకంగా తమ నంబర్‌ ప్లేట్లను కనిపించకుండా సగం వరకు వంచేయడం, ఇంకొందరు విరగ్గొట్టడం, ప్లాస్టర్లు అతికించడం వంటివి చేస్తూ ఆర్టీఏ, ట్రాఫిక్‌ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. (చదవండి: మరమ్మతు చేస్తుండగా కరెంట్‌ సరఫరా )

ప్రమాదాలు కొని తెచ్చుకునేలా.. 
► అసలే ఇరుకు రోడ్లు.. ఆపై రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో స్పీడ్‌గా వాహనాలను నడపడానికి పాతబస్తీలో ఏ మాత్రం అవకాశం లేదు. అయినప్పటికీ కొందరు కుర్రాళ్లు రెట్టింపు ఉత్సాహంతో స్పీడ్‌గా ముందుకెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. 
► ట్రాఫిక్‌ పోలీసుల కళ్లుగప్పి త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. 

 ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై కఠిన చర్యలు
ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. వెంటనే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ప్రమాదాల బారీ నుంచి తమను తాము కాపాడుకోవడమే కాకుండా ఇతరులకు ప్రమాదాలు కలిగించరాదంటూ అవగాహన కల్పిస్తామన్నారు. పాతబస్తీలో కూడా ట్రాఫిక్‌ నిబంధనలను కఠినతరం చేస్తాం. 
– శ్రీనివాస్‌ రెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ, దక్షిణ మండలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top