
యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ సమీపంలో రెండు రైలు బోగీల నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు.. సమాచారాన్ని వెంటనే రైల్వే సిబ్బందికి చేరవేశారు. డెమో ప్యాసింజర్ రైలు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బీబీనగర్ వద్ద రైలును నిలిపివేసి రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు గంటకుపైగా రైలు నిలిచిపోయింది.
బ్రేక్ ప్యాడ్‌లో లోపం కారణంగా రాపిడితో మంటలు వచ్చినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దట్టమైన పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు.. రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. బీబీనగర్ స్టేషన్‌లో మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కాచిగూడ రైల్వే స్టేషన్‌కు రైలు బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.