40ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
భువనగిరి: భువనగిరి మున్సిపాలిటీలో సుమారు 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. భువనగిరి కోట ప్రస్తుతం కాంగ్రెస్‌కు కంచుకోటగా మారిందన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మందితో పాటు స్వతంత్రులు మద్దుతు ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టిన నేపథ్యంలో అభివృద్ధి విషయంలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రస్తుతం రూ. 70 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో రూ. 100కోట్ల నిధులను తీసుకవచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 65 శాతం విజయం సాధించగా మున్సిపల్ ఎన్నికల్లో 95 శాతం వరకు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తప్పిదాల వల్ల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీఎన్నికల్లో కూడా ఇంటికి పంపారన్నారు. వారికి త్వరలోనే శాశ్వతంగా ముగింపు పలికే రోజు వస్తుందన్నారు. ప్రస్తుతం అంతర్గతంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నూతన పాలక వర్గం రెండన్నర సంవత్సరాల కాలం పాటు ఉంటుందని అనంతరం ఇతరులకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
కంటితడిపెట్టిన కౌన్సిలర్ గంజి శ్రీవాణి
భువనగిరి: తనకు చైర్మన్ పదవి ఇస్తానని మాటిచ్చి మోసం చేశారంటూ 11వ వార్డు కౌన్సిలర్ గంజి శ్రీవాణి మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కంటతడిపెట్టారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం సమయంలో చైర్మన్ ఎన్నికకు ముందు ఆమె మాట్లాడారు. ఓసీ, బీసీ, లోకల్ నాన్ లోకల్ వైరుధ్యాలు ఎందుకంటూ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. తమ బొమ్మాయిపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం అయ్యాక దూరం సృష్టిస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉన్నత విద్యాభ్యాసం చేశానని, అనర్హులకు అవకాశం ఇవ్వడం, కులాల పేరుతో ఓసీలను తొక్కేస్తే ఎలా అని నిలదీశారు. 35 వార్డులో అందరూ బీసీలే అయితే తాను ఒక్కదాణ్నే ఓసీఅని అన్నారు. 40 ఏళ్ల నుంచి ఓసీలకు చైర్మన్ పదవి రాలేదన్నారు. సీనియర్ల పేర్లతో కొత్తగా వచ్చే వారికిఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నంచారు. ప్రజాభీష్టంమేరకు ఎన్నిక జరిగిందని తర్వాత కొత్తవారికి అవకాశం ఉంటుందని ఆమెను ఎమ్మెల్యే సముదాయించడంతో తన సీట్లో కూర్చున్నారు.
యాదగిరీశుడి ప్రధానాలయం శుద్ధి
యాదగిరిగుట్ట : ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధానాలయాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో సోమవారం ఆలయ పర్యవేక్షకులు, సిబ్బంది శుద్ధి చేశారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేందుకు తక్కువ సమయం ఉన్నందున సోమవారం మధ్యాహ్నం 2.30 నుంచి 3గంటల వరకు ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆ సమయంలో భక్తులకు శ్రీస్వామి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. గర్భాలయంతో పాటు ఉప ఆలయాలు, ముఖ మండపం, క్యూలైన్లు, ఆలయ ప్రథమ ప్రాకార మండపాలను సిబ్బంది శుద్ధి చేశారు. అంతకు ముందు గర్భాలయంలోని స్వయంభూలకు ఆలయ కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్, ప్రధానార్చకులు సురేంద్రచార్యులకు సింధూర లేపనాన్ని అందజేశారు.
40ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది
40ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది


