కొలువుదీరారు
మున్సిపాలిటీల్లో అట్టహాసంగా పాలకవర్గాల ప్రమాణ స్వీకారం
సాక్షి, యాదాద్రి : మున్సిపాలిటీల్లో కొత్త పాలవర్గాలు కొలువుదీరాయి. మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ సోమవారం అట్టహాసంగా కొనసాగింది. క్యాంపులకు వెళ్లిన కౌన్సిలర్లు ఉదయమే నేరుగా సమావేశాలకు హాజరయ్యారు. సంపూర్ణ మెజార్టీ రావడంతో ఆరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగిరింది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేల్ దగ్గరుండి వారిని ఎన్నకున్నారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా భువనగిరి, చౌటుప్పల్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆలేరులో వివాదం లేకుండానే
ఆలేరు మున్సిపల్ చైర్మన్‌గా 7వ వార్డుకు చెందిన బీజని బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్‌గా 6 వవార్డుకు చెందిన అంగిడి అంజనేయులు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ పేరు పోలింగ్‌కు ముందుగానే ప్రకటించారు. వైస్ చైర్మన్ విషయంలో ఎస్సీ కేటగిరీలో పస్తం అంజనేయులు, ఎస్టీ కేటగిరీలో ఉన్న అంగిడి అంజనేయులు కోసం వారి అనుచరులు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చారు. అయితే సుదీర్గ చర్చల అనంతరం పార్టీని నమ్ముకుని ఉన్న అంజనేయులువైపే ఎమ్మెల్యే మొగ్గు చూపారు.
పోచంపల్లిలో తడ్క వెంకటేశ్
జిల్లాలో ఉన్న ఏకై క జనరల్ కేటగిరీ మున్సిపాలిటీ పోచంపల్లి చైర్మన్‌గా తడ్క వెంకటేశ్, వైస్ చైర్‌పర్సన్‌గా కొయ్యడ రజిని శ్రీనివాస్‌లు ఎన్నికయ్యారు. ముందుగానే ఎమ్మెల్యే చైర్మన్ పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. గత మున్సిపల్ ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వు అయిన పోచంపల్లి ఈ సారి జనరల్‌కు రిజర్వు అయ్యింది. ఇండిపెండెంట్ సభ్యుని రాకతో మెజార్టీ ఏర్పడింది.
గుట్టలో చివరి నిమిషంలో
వైస్ చైర్‌పర్పన్ పేరు మార్పు
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్మన్‌గా గండ్లపల్లి వాణి భరత్ గౌడ్ , వైస్ చైర్‌పర్సన్‌గా బరిగే రమ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా వాణి పేరు ఎమ్మెల్యే ముందుగానే ప్రకటించారు. వైస్ చైర్మన్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్ పేరు దాదాపు ఖరారైంది. చివరి నిమిషంలో యాదవ్ స్థానంలో బరిగే రమ్య పేరును ఎమ్మెల్యే ప్రకటించారు.
మహిళా సాధికారత
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పోచంపల్లి మినహా ఐదు చోట్ల మహిళలే చైర్‌పర్సన్ పీఠం అధిష్టించారు. మూడు జనరల్ మహిళా స్థానాల్లో బీసీ మహిళలకే పదవి దక్కింది.
మోత్కూరులో ఎమ్మెల్యే,
ఎంపీల అనుచరులకు చెరో పదవి
మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు తమ అనుచరులకు ఇప్పించారు. ఎస్సీ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్న చైర్‌పర్సన్ పదవికి ఎమ్మెల్యే సూచించిన తన వర్గానికి చెందిన గడ్డం స్వప్నను , వైస్ చైర్మన్ పదవికి ఎంపీ వర్గానికి చెందిన పల్లెర్ల వెంకన్నను ఖరారు చేశారు. వీరిని కౌన్సిలర్లు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.
ఫ ఆరు చోట్లా ఎగిరిన కాంగ్రెస్ జెండా
ఫ అంతటా అధికార పార్టీ చైర్మన్లు, వైస్ చైర్లన్ల ఎన్నిక
ఫ ఐదింటిలోనూ మహిళా చైర్‌పర్సన్లే
ఫ మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి
కొలువుదీరారు


