జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇక ఆఫీసుల చుట్టూ తిరగొద్దు! | Birth And Death Certificate Registration Telangana Government Key Changes | Sakshi
Sakshi News home page

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు

May 18 2022 3:01 PM | Updated on May 19 2022 3:44 PM

Birth And Death Certificate Registration Telangana Government Key Changes - Sakshi

ఈ విధానాన్ని మార్చిన ప్రభుత్వం ఫామ్‌ 1,2 రిజిస్ట్రేషన్‌ను ఆస్పత్రులకే అప్పగించింది. శిశువు జన్మించగానే ఆన్‌లైన్‌లో తమ ఆస్పత్రి కోడ్‌తో

ఖమ్మం మయూరిసెంటర్‌: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇక ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఆస్పత్రులు, పురపాలికలు అంటూ ఎంతో కొంత ఖర్చు చేసి ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. ఇక నుంచి అలాంటి అవసరమే లేకుండా ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేసింది. ఇప్పటివరకు వాటి కోసం మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా అనేక కొర్రీలతో అధికారులు జారీ చేసేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాల జారీలో మార్పులు తీసుకొచ్చి అమలు చేస్తుంది. పుట్టిన వెంటనే రికార్డు నమోదయ్యేలా కీలక మార్పులు చేసింది. అలాగే మరణించిన వ్యక్తి వివరాలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసేలా చర్యలు తీసుకుంది. జన్మించిన, మరణించిన చోటే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తీసుకొచ్చింది. 

ఆస్పత్రిలోనే..
శిశువు జన్మిస్తే ధ్రువీకరణ పత్రం కోసం ఇంతకుముందు ఆస్పత్రి వారు పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు, సమయం నమోదు చేసి మున్సిపల్‌ కార్యాలయానికి పంపించేవారు. అక్కడ ఆస్పత్రి వారు పంపించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేసే వారు. ఫామ్‌ 1,2 మున్సిపల్‌ అధికారులే రిజిస్ట్రేషన్‌ చేసేవారు. ఈ విధానాన్ని మార్చిన ప్రభుత్వం ఫామ్‌ 1,2 రిజిస్ట్రేషన్‌ను ఆస్పత్రులకే అప్పగించింది. శిశువు జన్మించగానే ఆన్‌లైన్‌లో తమ ఆస్పత్రి కోడ్‌తో ఫామ్‌ 1,2 రిజిస్ట్రేషన్‌ చేస్తారు. రిజిస్ట్రేషన్‌ పూర్తవగానే ఒకట్రెండు రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రం ఆన్‌లైన్‌లో తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. జనన ధ్రువీకరణ పత్రంలో సవరణలు ఉంటే నేరుగా మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు ఆన్‌లైన్‌లో సవరణల దరఖాస్తును పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. 

మరణించిన వెంటనే.. 
మరణ ధ్రువీకరణ పత్రాన్ని సులువుగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఎవరైనా ఆస్పత్రిలో మరణిస్తే అక్కడే వ్యక్తి ఆధార్‌ వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్‌ చేయని పక్షంలో వైకుంఠధామంలో మున్సిపల్‌ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపడతారు. ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్ద మరణించినా.. సంబంధిత వ్యక్తి వివరాలను ఇంటి వద్ద లేదా దహన సంస్కారాల ముందు వైకుంఠధామంలో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. రిజిస్ట్రేషన్‌ అనంతరం మున్సిపల్‌ అధికారులు సంతకం చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. వ్యక్తి బంధువులు దానిని ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఇక ఇంటి వద్ద మరణించిన వ్యక్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కార్పొరేషన్‌ అధికారులు ఇంటి వద్దనే పూర్తి చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. 

కీలక మార్పులు..
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగంగా జరిగేందుకు ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆస్పత్రిలో జన్మించినా, మరణించినా అక్కడే సంబంధిత వివరాలను ఆస్పత్రి సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాల ప్రకారం ధ్రువీకరణ పత్రం మంజూరవుతుంది. ఒకవేళ సవరణలు చేసుకునేందుకు మీ సేవల్లో దరఖాస్తు చేసుకుంటే మున్సిపాలిటీ నుంచి సవరణ చేసి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తారు. జనన, మరణ రిజిస్ట్రేషన్ల కోసం మున్సిపాలిటీలకు రావాల్సిన అవసరం లేదు.
– ఆదర్శ్‌ సురభి, కేఎంసీ కమిషనర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement