సాహో.. బాబాసాహెబ్‌ 

Another step was taken in the process of setting up the statue of BR Ambedkar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించిన అంబేడ్కర్‌కు నగరంలో 125 అడుగుల విగ్రహం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఆయన 125వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. విగ్రహ నిర్మాణానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయగా.. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి విగ్రహ నిర్మాణంపై పరిశీలన చేశాయి. తాజాగా విగ్రహ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ (డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌) కొలిక్కి వచ్చింది. ఇటీవల రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన విగ్రహ నిర్మాణ కమిటీతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రూ.150 కోట్ల అంచనాతో డీపీఆర్‌ను సిద్ధం చేశారు. ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి డీపీఆర్‌ను రూపొందించినట్టు తెలిసింది. 

విశాల భవనంపైన విగ్రహం... : అంబేడ్కర్‌ విగ్రహాన్ని విశాలమైన భవనంపైన ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్‌ ఆకృతిలో ఈ భవనం ఉండనుంది. ఇందులో అంబేడ్కర్‌ జీవిత చరిత్ర, ముఖ్య ఘట్టాలు, ఆయన రాసిన పుస్తకాలతో మ్యూజియం ఏర్పాటు చేస్తారు. అంబేడ్కర్‌పైన వచ్చిన పుస్తకాలు, పోరాట నేపథ్యం, హక్కుల సాధన తదితర అంశాలతో లైబ్రరీ, పెద్ద మీటింగ్‌ హాల్, మెడిటేషన్‌ హాల్, కెఫిటేరియా, నిర్వహణ విభాగం కార్యాలయం తదితరాలుంటాయి. ఇక, విగ్రహాన్ని కాంస్యంతో తయారు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ భవనం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. సందర్శకులు, పార్కింగ్, తదితరాల కోసం మరో 19 ఎకరాల్లో ఏర్పాట్లు చేయనున్నారు. మొత్తంగా 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. ఈ నెలాఖరు నాటికి డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top