రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి కుద్దిరాం రైల్వే గేట్ సమీపంలో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. మృతునికి సుమారు 45 ఏళ్లు ఉంటాయని, నీలం రంగు గళ్ల చొక్కా, నలుపు రంగు ప్యాంట్‌ను ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసినవారు స్థానిక జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
మెళియాపుట్టి: ఆలయానికి ప్రసాద సామగ్రి తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జోడూరు గ్రామానికి చెందిన తిప్పాన భార్గవ్ ద్విచక్ర వాహనంపై గ్రామం నుంచి పట్టుపురం శివాలయానికి ప్రసాద సామాగ్రి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యలో ప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు 108 ద్వారా టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి


