ఉద్యమ బాటలో ఉద్యోగులు
ఉద్యోగులను వంచించిన చంద్రబాబు ప్రభుత్వం
ఫ్యాప్టో ఆధ్వర్యంలో నేడు చలో విజయవాడ
ఉపాధ్యాయుల సత్తాను చూపిస్తాం
ఉద్యమాలే గతి
శ్రీకాకుళం: ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌తో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చినా వాటిలో ఒక్కటి కూడా నెరవేరలేదు. పీఆర్పీ కమిటీలు, ఐఆర్ వంటివి ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేస్తామన్న హామీ గాలికి వదిలేశారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటి వరకు దాని ఊసే లేకుండా పోయింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ అమలు అటు ఉంచితే ఉన్న ఉద్యోగాలనే ఊడబీకిన పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్‌లోనూ ఉద్యోగుల సంక్షేమం ప్రస్తావన లేదు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నా యి. సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాట పడుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డంకులు సష్టిస్తున్నాయని ఉపాధ్యాయ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. రానున్న కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తమ సత్తా ఏమిటో చూపిస్తామని వారు అంటున్నారు
విద్యా సంస్కరణల పేరుతో టీచర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోలేదు. రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిగణనలోనికి తీసుకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. రానున్న రోజుల్లో మా సత్తాను చూపిస్తాం.
– ఎస్.కిశోర్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఉద్యమాలు తప్పడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏనాడూ నెరవేర్చిన దాఖలాలు లేవు. ఆయనను నమ్మి మరోసారి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మోసపోయారు. త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.
– పడాల తమ్మినాయుడు,ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి
ఉద్యమ బాటలో ఉద్యోగులు
ఉద్యమ బాటలో ఉద్యోగులు


