సాక్షి, పుట్టపర్తి: ‘వెన్నుపోటు’కు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరుగాంచిన చంద్రబాబు తన పంథా మార్చుకోలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ సంపూర్ణంగా అమలు చేసింది లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘పోరు బాట, ఫీజు పోరు, ఉచిత గ్యాస్ ఎప్పుడిస్తారు’ అంటూ పలుమార్లు ఉద్యమాలు చేయడంతో కొన్ని పథకాలు అరకొరగా అమలు చేశారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం అంటూ కొందరికే ఇచ్చారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం అంటూ తొలిసారి కొందరికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు కొందరికే జమ చేశారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి దగా చేశారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పిస్తామని కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్కరికీ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఊసే లేకుండా చేశారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకుండా ప్రైవేటు ఆస్పత్రులను ఇబ్బందులపాలు చేశారు. రాజకీయ కక్ష సాధింపుతో లక్షలాది మంది పింఛన్లు తొలగించారు. కొత్త పింఛన్ల ప్రస్తావనే లేదు. రెండేళ్లుగా ఎంతోమంది అర్హులు ఉన్నా పింఛన్ తీసుకునేందుకు అవకాశం లేకుండా చేశారు. వలంటీర్లకు నెలకు రూ.10 వేలు ఇస్తామని వారిని అడ్రస్ లేకుండా చేశారు.
రెండేళ్లుగా రాక్షస పాలన..
ఎన్నికల హామీలు, పథకాలు పక్కన పెడితే రెండేళ్లుగా రాక్షస పాలన కొనసాగుతోంది. అరాచకాలు, అక్రమాలు, అత్యాచారాలు, అక్రమ కేసులు, అరెస్టులు, హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా జిల్లా నిలిచింది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గ్యాంగ్ రేప్‌లు, సామూహిక అత్యాచారాలు వెలుగు చూశాయి. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల సమయంలో లింగమయ్య హత్య కలకలం రేపింది. పేరూరు పంచాయతీలోని ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం భయభ్రాంతులకు గురి చేసింది. అంతకుముందు చిలమత్తూరులో గ్యాంగ్ రేప్‌తో మొత్తం జిల్లానే ఉలిక్కిపడింది.
ఐదేళ్లూ సంక్షేమం, అభివృద్ధి ..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు తీసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హత ఆధారంగా పథకాలు అందజేశారు. పేదలకు అండగా నిలిచారు.
వైఎస్సార్ సీపీ పోరుబాట..
‘అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. ఇంటింటికీ ఉద్యోగం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, విద్యార్థులందరికీ తల్లికి వందనం, ఏడాదికి మూడు సిలిండర్లు, 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 అందిస్తాం.’
– ఎన్నికల సమయంలో
చంద్రబాబు చెప్పిన మాటలివి
‘సూపర్ సిక్స్ హామీలను చూస్తుంటే భయం వేస్తోంది. వాటి నిర్వహణ కష్టమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందున కొత్త పింఛన్లు కష్టమే. తల్లికి వందనం అర్హులందరికీ ఇస్తున్నాం. కేంద్రం మద్దతు ఇస్తే రైతులందరికీ అన్నదాత సుఖీభవ జమ చేస్తాం. ప్రతి ఏటా ఉద్యోగాలు కల్పిస్తాం.’
– అధికారంలోకి వచ్చాక వివిధ సందర్భాల్లో చంద్రబాబు చెప్పిన మాటలివీ..
ప్రజలను దారుణంగా
మోసగించిన చంద్రబాబు
‘సూపర్ సిక్స్’ హామీల్లో ఒక్కటీ
సరిగా అమలు చేయని వైనం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
అర్హులందరికీ పథకాలు
బాబు దగాను నిరసిస్తూ నేడు
వైఎస్సార్ సీపీ ‘వెన్నుపోటు దినోత్సవం’
అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు
సాధ్యం కాని హామీలు గుప్పించి అన్ని వర్గాల ప్రజలకూ వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్ర బాబు వెంటనే పదవి నుంచి దిగిపోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వెన్నుపోటు దినోత్సవం’ నిర్వహణకు సిద్ధమైంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం ర్యాలీలు నిర్వహించనున్నారు.
పెనుకొండ సమీపంలోని జాతీయ రహదారిలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం నుంచి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సాగుతుంది.
పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండల కేంద్రంలో మరువ ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది.
కదిరి నియోజకవర్గ కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానం నుంచి సమన్వయకర్త బీఎస్ మక్బుల్ ఆధ్వర్యంలో నానా దర్గా వరకు ర్యాలీ చేపడతారు.
ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కేతిరెడ్డి వెంకటక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో పీఆర్టీ సర్కిల్ వరకు ర్యాలీ ఉంటుంది.
మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు.
హిందూపురం నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుంది.
రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీ నరిగెమ్మ గుడి దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది.


