ఎస్‌ఐఆర్‌ను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ను విజయవంతం చేయండి

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

ప్రశాంతినిలయం: కచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించనున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం సాయంత్రం జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ కొండయ్యతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 14,23,839 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో పురుషులు 7,06,751, మహిళా ఓటర్లు 7,16,877, థర్డ్‌ జండర్‌ 65 మంది ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 67.44 శాతం ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయిందన్నారు. ఈ నెల 14 వరకూ సన్నాహాలు, శిక్షణ, ముద్రణ ఉంటాయన్నారు. 15 నుంచి జూలై 14 వరకూ బీఎల్‌ఓల ఇంటింటి సందర్శన, జూలై 14న పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, జూలై 21న డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా ప్రచురణ, ఆగస్టు 20 వరకూ అభ్యంతరాల స్వీకరణ, జూలై 21 నుంచి సెప్టెంబర్‌ 18 వరకూ అభ్యంతరాల పరిష్కారం, ఆగస్టు 22న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. వేరే ప్రాంతాలకు మారిన, మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగిస్తామన్నారు.

ల్యాప్‌టాప్‌ల అందజేత

డిజిటల్‌ విధానంతో స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల సేవలు మరింత బలోపేతం అవుతాయని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పేర్కొన్నారు. వెలుగులో పని చేసే డీపీఎం, ఏపీఎంలకు గురువారం కలెక్టరేట్‌లో ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సేవలను మరింత వేగవంతం చేయడానికి ల్యాప్‌టాప్‌లు కీలక సాధనాలుగా ఉపయోగపడతాయన్నారు. పనిలో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఎంలు సత్యనారాయణ, రామిరెడ్డి, రామమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement