పుట్టపర్తి అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మోడల్‌స్కూళ్లలో ఉన్న ఇంటర్ కళాశాలల బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మాత్రం చెల్లించకపోవడం గమనార్హం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 25 మోడల్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 4 వేల మంది ఉన్నారు. నాలుగు గ్రూపులుండగా, ఒక్కో గ్రూపులో 20 మంది చొప్పున మొదటి సంవత్సరంలో 80 మంది,రెండో సంవత్సరంలో 80 మంది కలిపి 160 మంది విద్యార్థుల చొప్పున చదువుతున్నారు. వీరిలో 50 మంది చొప్పున బాలికలకు అక్కడే హాస్టల్ వసతి కల్పించారు. తక్కిన 110 మంది ఉదయం ఇంటి వద్ద టిఫిన్ చేసి వెళ్తే మధ్యాహ్నం కళాశాలలోనే భోజనం అందిస్తారు. మొత్తంగా బాలికలు 1,250 మందికి అక్కడే హాస్టల్‌లో భోజనాలు అందిస్తుండగా, 2,750 మందికి మధ్యాహ్న భోజనాలు ఏజెన్సీ నిర్వాహకులు అందిస్తారు. ఆయా విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజన బిల్లులు ఏడాది నుంచి చంద్రబాబు ప్రభుత్వం అందించక పోవడంతో ఏజెన్సీ వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కో ఏజెన్సీకి రూ.10 వేలకు పైగా చెల్లించాల్సి ఉందని పేర్కొంటున్నారు. మొత్తంగా ఏజెన్సీలకు రూ.2.5 లక్షల వరకూ చెల్లించాల్సి ఉందన్నారు. ఇంత కాలం పాఠశాలల విద్యార్థులకు వచ్చే బిల్లులతో సర్దుకుపోయామని, ఇకపై చేయలేమంటూ ప్రిన్సిపాళ్ల వద్ద పలువురు ఏజెన్సీనిర్వాహకులు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై డీఈఓ కిష్టప్పను వివరణ కోరగా పెండింగ్ బిల్లుల విషయం ప్రభుత్వానికి విన్నవించామన్నారు. నిధులు రాగానే చెల్లిస్తామన్నారు.
ఏడాది నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించని ప్రభుత్వం
ఇబ్బంది పడుతున్న ఏజెన్సీలు
ఉమ్మడి జిల్లాలో రూ.2.5 లక్షలకు పైగా పెండింగ్ బిల్లులు


