పుట్టపర్తి టౌన్: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు తప్పవని ఏపీ ఏజేసీ అమరావతి నాయకులు హెచ్చరించారు. గురువారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో ఏపీ జేఏసీ అమరావతి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ మైనుద్దీన్, జనరల్ సెక్రటరీ వైపీ రావ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదన్నారు. తమ సమస్యలు ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించి ఐఆర్‌ను ప్రకటించాలని, డీఏ, పీఆర్‌సీ, ఎస్‌ఎల్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవులను రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకూ ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పే స్లిప్‌లలో చూపాలని, పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులందరికీ 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని, సరెండర్ లీవ్‌లు ఎప్పటికప్పుడు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనకు పోరాటాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, రమణప్ప, ఆదెన్న, ముత్యాలుతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.


