పుట్టపర్తి అర్బన్: లింగ నిర్ధారణను అరికట్టేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 18002332447ను ప్రవేశ పెట్టినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజబేగం పేర్కొన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పీసీపీఎన్‌డీటీ చట్ట ఉల్లంఘనపై సమాచారం అందించాలన్నారు. ఆడ శిశువు హక్కుల పరిరక్షణ, లింగ వివక్ష నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. అనుమతి లేని స్కానింగ్, డయాగ్నస్టిక్ కేంద్రాలు, లింగ నిర్ధారణ సేవల ప్రకటనలు, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు, లింగ ఎంపికను ప్రోత్సహించే ఏ విధమైన కార్యకలాపాలు ఉన్నా హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అక్రమంగా లింగ నిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
టాలీ, కంప్యూటర్ కోర్సులపై శిక్షణ
ధర్మవరం: నిరుద్యోగ యువతకు టాలీ, కంప్యూటర్ కోర్సుల్లో నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఉన్నతి ఫౌండేషన్ అడ్మిషన్ల కోఆర్డినేటర్ హరిప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 35 రోజుల పాటు బెంగళూరులో శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టాలీ ప్రైమ్, కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూల్లో రాణించేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారన్నారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు అర్హులని తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల్లోపు వయసు ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అడ్మిషన్ల కోసం 9000487423 నంబర్‌లో సంప్రదించాలన్నారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


