పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన రెండేళ్ల తర్వాత రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రకటించింది. సబ్సిడీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, నూర్పిడి యంత్రాలు తదితర పనిముట్లు ఇస్తామని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేశారు. గత నెల 2న నోటిఫికేషన్ ఇవ్వగానే జిల్లాకు సంబంధించిన 2,600 మంది రైతులు సబ్సిడీ ట్రాక్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మే 26న లాటరీ ప్రక్రియను పూర్తి చేసి యంత్రాలను అందిస్తామని నమ్మబలికారు. అయితే పథకం ఆలస్యం కావడంతో రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించారు. మరోసారి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దరఖాస్తు చేసుకునేందుకు మరో 8 రోజులు గడువు పొడిగించారని సర్ది చెప్పారు. జూన్ 4 నాటికి యంత్రాలు అందజేస్తామన్న సమయమూ పూర్తయింది. రైతులు అధికారులను ప్రశ్నిస్తుండటంతో వారికి కూడా ఏ చేయాలో పాలుపోవడం లేదు. ‘ప్రభుత్వం పథకంలో మార్పులు చేసిందని .. సబ్సిడీ మొత్తం ఇవ్వలేదు’ ఇలా పలు రకాల సమాధానాలు చెబుతున్నారు.
ఇప్పటికే ప్రారంభమైన ఖరీఫ్ సీజన్
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 2026–27 సంవత్సరానికి జిల్లాకు సబ్సిడీ ట్రాక్టర్లు, ట్రాక్టర్ పనిముట్లు, స్ప్రేయర్లు, సెల్ఫ్ ప్రోఫెల్లెడ్ ఎక్విప్‌మెంట్, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, హెర్వెస్టింగ్, నూర్పిడి యంత్రాలు, రోటోవేటర్లు, విత్తనగొర్రు, ఎండు గడ్డి, మేత సామగ్రిలకు రూ.4.01 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు చిన్న, సన్న కారు రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతరులకు 40 శాతం సబ్సిడీ ఇస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సంబంధిత రైతులకు భూమి ఉండాలని , కనీసం మూడుసార్లు ఈ–పంటలో నమోదు చేయించి ఉండాలని, గతంలో సబ్సిడీ పొంది ఉండకూడదని, భూమి రికార్డులు సమర్పించాలని, ఆన్‌లైన్ దరఖాస్తులను జేసీ స్వయంగా లాటరీ తీసి ఎంపిక చేస్తారని తెలిపారు. అనంతరం అర్హులైన జాబితాపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సంతకం చేసిన తర్వాత 15 రోజులకు సబ్సిడీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు రెండు నోటిఫికేషన్లు ఇచ్చినా దరఖాస్తు ప్రక్రియ మాత్రమే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు తప్ప సబ్సిడీపై ట్రాక్టర్లు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఇప్పటికే సబ్సిడీపై యంత్రాలు అందజేసి ఉంటే బాగుండేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం డీజిల్, పెట్రోలు ధరలు పెరగడంతో ట్రాక్టర్ల వ్యవసాయం సైతం భారంగా మారింది. కాడి ఎద్దులు ఎక్కడా కనిపించకుండా పోయాయని ప్రభుత్వం వెంటనే సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పక్కాగా...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ చెప్పిన తేదీకి వైఎస్సార్ యంత్రసేవను ప్రారంభించారు. ట్రాక్టర్ల సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి వారికి అండగా నిలిచారు. ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక రైతు కమిటీని ఏర్పాటు చేసి ట్రాక్టర్లు అందజేశారు. వాటితో పాలు పలు రకాల యంత్రాలు కూడా అందజేశారు. ట్రాక్టరు ,యంత్రాల పొందిన రైతులు ఇప్పటికీ వైఎస్ జగన్ చేసిన మేలును మరచిపోలేదు.
పత్తా లేని వ్యవసాయ యాంత్రీకరణ పథకం
గడువు దాటినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
వేలాది మంది రైతుల ఎదురుచూపు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను ఏ విధంగానూ ఆదుకోవడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ, పరిహారం, పంటలకు మద్దతు ధర ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటిలో కర్షకులకు అన్యాయమే చేస్తోంది. తాజాగా సబ్సిడీతో ట్రాక్టర్లు మంజూరు చేస్తామని గొప్పలు చెప్పింది. గడువు ముగిసినా నేటికీ ఆ పథకాన్ని అమలు చేయకుండా అటకెక్కించింది.
ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి
సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాల పథకానికి ఇప్పటికే రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చాము. గడువు పూర్తయింది. కొన్నింటికి దరఖాస్తులు రాలేదు. రాని వాటి సబ్సిడీని వచ్చిన యంత్రాల దరఖాస్తులకు అందజేయాలని కోరాము. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ప్రక్రియ ప్రారంభిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ఇంకా అమలు కాలేదు. జిల్లాకు రూ.4.01 కోట్లు కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే సబ్సిడీ ట్రాక్టర్లు అందజేస్తాము.
– నారాయణనాయక్, డీఏఓ
చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలు రైతులకు అందించేసరికి ఖరీఫ్ సీజన్ పూర్తయ్యేలా ఉంది. వాటి కోసం ఎదురు చూడటం కంటే వ్యవసాయం మానేయడం మంచిది. ఈ ఏడాది వర్షాలు ఎల్‌నినో ప్రభావంతో సరిగా కురవవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రబాబు ఉంటే మూడేళ్లు వ్యవసాయం జోలికి వెళ్లకపోవడమే మంచిది. రైతుకు ఒక్క సంక్షేమ పథకాన్నీ అందజేయడంలేదు.
– నాగిరెడ్డి,
రైతు, బుక్కపట్నం


