‘టెట్‌’ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘టెట్‌’ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

కదిరి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. డీఎస్సీ రాయాలంటే టెట్‌ అర్హత తప్పనిసరి. ఈ ఏడాది అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. డీఎస్సీ అర్హత మార్కులతో టెట్‌ నుంచి 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో ఈసారి టెట్‌కు డీఎస్సీ రాసే అభ్యర్థుల నుండి ఎక్కువ పోటీ ఉండనుంది. వీరితో పాటు ఇన్‌ సర్వీస్‌ టీచర్లు కూడా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టు తీర్పుతో...

ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ అర్హత తప్పనిసరి కానుంది. 2011 నుంచి టెట్‌ నిర్వహిస్తున్నారు. ఇన్‌ సర్వీస్‌ టీచర్లు పదోన్నతి పొందాలన్నా టెట్‌ తప్పనిసరి చేశారు. ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉపాధ్యాయులంతా కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. జిల్లాలో అన్ని కేటగిరీలకు చెందిన టెట్‌ రాయాల్సిన ఉపాధ్యాయులు 4 వేల మంది దాకా ఉన్నారు. డీఎస్సీ అభ్యర్థులతో కలిపి మొత్తం 9 వేల మంది దాకా ఈసారి టెట్‌కు పోటీ పడనున్నారు.

టెట్‌కు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇలా...

● ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 5 నుంచి జూలై 5 వరకు సమయం ఇచ్చారు.

● జూలై 15 నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

● జూలై 25 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

● ఆన్‌లైన్‌లో రెండు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

● ఉదయం 9.30 నుంచి 12 గంటలు వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు నిర్వహిస్తారు.

● ప్రాథమిక కీ ఆగస్టు 24న, ఫైనల్‌ కీ సెప్టెంబర్‌ 8న విడుదల చేస్తారు.

● సెప్టెంబర్‌ 15 టెట్‌ ఫలితాలు విడుదల చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ జూలై 5

ఇన్‌సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక ‘టెట్‌’ నిర్వహించాలని డిమాండ్‌

నోరు మెదపని చంద్రబాబు సర్కారు

టీచర్లు సద్వినియోగం చేసుకోండి

ఇన్‌ సర్వీస్‌ టీచర్లు టెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే భావనతో గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన టెట్‌కు చాలా మంది టీచర్లు దరఖాస్తు చేసుకోలేదు. కొందరైతే దరఖాస్తు చేసుకొని కూడా పరీక్షకు హాజరు కాలేదు. ఇప్పుడు రాయక తప్పదు. పదోన్నతులకు సైతం టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి.

– కిష్టప్ప, డీఈఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement