వడ్డీ వ్యావారి దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యావారి దాష్టీకం

Jun 10 2026 1:19 AM | Updated on Jun 10 2026 1:19 AM

కంతు కట్టలేదని వ్యక్తి కిడ్నాప్‌... దాడి

ధర్మవరం అర్బన్‌: మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరంలో వడ్డీవ్యాపారుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. వడ్డీ డబ్బు కట్టలేదన్న కారణంతో ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన వడ్డీ వ్యాపారి...ఆపై దారుణంగా దాడి చేశాడు. బాధితుడి వివరాల మేరకు... పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన పంచర్‌ షాపు నిర్వాహకుడు బుర్రా హరికృష్ణ స్థానిక దిమ్మిల సెంటర్‌ సమీపంలోని వడ్డీ వ్యాపారి మహేష్‌తో ఏడాది క్రితం రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. వారానికి రూ.5 వడ్డీతో అతనికి నెలకు నాలుగుసార్లు వడ్డీ కట్టేవాడు. అయితే ఆరోగ్యం బాగలేక రెండునెలలుగా వడ్డీ కట్టడం లేదు. దీంతో మంగళవారం పంచర్‌ షాపు వద్దకు వచ్చిన మహేష్‌, అతని అనుచరులు ఆరుగురు హరికృష్ణను డబ్బులు అడిగారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో హరికృష్ణను బలవంతంగా టూవీలర్‌లో ఎక్కించుకుని దిమ్మిల సెంటర్‌ సమీపంలోని మసీదు పక్కకు పిలుచుకుని వెళ్లి చితకబాదాడు. హరికృష్ణ భార్య గీత వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దిమ్మిల సెంటర్‌ సమీపంలోకి వెళ్లగానే మహేష్‌తో పాటు అతని అనుచరులు పారిపోయారు. అప్పటికే వారు హరికృష్ణను చితకబాదడంతో అతనికి ఫిట్స్‌ వచ్చాయి. దీంతో అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు చికిత్స చేయించేందుకు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.8 లక్షల వరకూ అప్పు చేశానన్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో వడ్డీ చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తీవ్రతరం కాగా, మే 29న ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎవరైనా తన ఇంటి వద్దకు వస్తే వారిని బైండోవర్‌ చేస్తామని పోలీసు అధికారులు చెప్పారన్నారు. అయినా డబ్బులు ఇవ్వాలంటూ రోజూ వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని హరికృష్ణ వెల్లడించాడు.

పని చేయకుంటే కఠిన చర్యలు

అనంతపురం న్యూటౌన్‌: బాధ్యతలను గుర్తెరిగి సక్రమంగా విధులను నిర్వర్తించకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారిణి (సీఈఓ) విజయలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం స్థానిక డీపీఆర్సీలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు ‘గ్రామ పంచాయతీల అభివద్ధి ప్రణాళిక రూపకల్పన’ అనే అంశంపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఈఓ మాట్లాడుతూ కొందరు ఎంపీడీఓలు విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. కలెక్టర్‌ నిర్వహించే వీడియో కాన్ఫరెన్సులకు డుమ్మా కొట్టడం సరికాదన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం లేదంటూ ఫిర్యాదులందాయన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎంపీడీఓపై నివేదికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం గ్రామాల అభివృద్ధి ప్రణాళికల తయారీలో మెలకువలను వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement